మంత్రి కేటీఆర్‌కు ఫాంహౌజ్ కష్టాలు

by Shyam |   ( Updated:2020-06-05 10:54:41.0  )
మంత్రి కేటీఆర్‌కు ఫాంహౌజ్ కష్టాలు
X

దిశ, న్యూస్ బ్యూరో: ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌‌కు ఫాంహౌజ్ కష్టాలు వచ్చాయి. జీఓ 111ను ఉల్లంఘిస్తూ దాని నిర్మాణం చేపట్టారన్న ఆరోపణల నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించేందుకు నిర్దేశించిన ఉత్తర్వులను, చట్టాలు చేసే హోదాలో ఉన్న వ్యక్తి ఉల్లంఘించారంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ మంత్రికి నోటీసులు జారీ అయ్యాయి. మంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు నోటీసులు పంపనున్నారు.ఈ విషయంపై నిజానిజాలు తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీని కూడా నియమించనున్నట్టు సమాచారం. ఈ కమిటీ కేంద్ర పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రాంతీయ కార్యాలయం అధికారుల నేతృత్వంలో నడుస్తోంది. సభ్యులుగా పీసీబీ, జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టరు సభ్యులుగా ఉండొచ్చు. కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించనుంది. ఫిర్యాదులో ఎంపీ రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ కన్జర్వేషన్ జోన్‌లో మూడంతస్తుల భవనం లక్ష చ.అ.ల విస్తర్ణంతో నిర్మించారు. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్ కూడా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్వను కూడా పూడ్చి రోడ్డు వేశారని, దాంతో సహజ వనరుల ధ్వంసం జరిగిందని ఆరోపించారు. జీఓ 111 ప్రకారం చట్ట విరుద్ధమని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ, మీర్జాగూడలో ఈ కట్టడాలను సాగించారు. ఐతే అధికారులెవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ పీసీబీ, హెచ్ఎండీఏ అధికార యంత్రాంగం చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలను తీసుకోలేదన్నారు. గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఈ నిర్మాణం ఉంది. తనతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనుచర వర్గం, కొందరు మీడియా ప్రతినిధులతో ఫాం హౌజ్‌ను పరిశీలించేందుకు వెళ్తుండగా సైబరాబాద్ పోలీసులు అడ్డుకొని కేసులు పెట్టినట్లు గుర్తు చేశారు. నిర్మాణానికి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ఐతే తన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ మౌనం వహించారు.కానీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు సుంకరి రాజు, ఎం.శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించినట్లు తెలిపారు. సదరు స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ భూమికి కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 8.09 ఎకరాల ఫాం హౌజ్ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ పేరిట ఉందన్నారు. ఐతే అదే సమయంలో డ్రోన్ కెమెరాలను చట్ట విరుద్ధంగా వినియోగించారంటూ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ కాలం ముగిసిన తర్వాత బయటికి రావడం తెలిసిందే. తాజా పరిణామాలతో రాజకీయం ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story