మాట్లాడే చెట్టు.. జూబ్లీహిల్స్ థీమ్‌ పార్కుకు జాతీయ అవార్డు

by Anukaran |
మాట్లాడే చెట్టు.. జూబ్లీహిల్స్ థీమ్‌ పార్కుకు జాతీయ అవార్డు
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, న‌మామి గంగే మిష‌న్ స‌హ‌కారంతో ఎలెట్స్ సంస్థ‌ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ రెండవ నేష‌న‌ల్ వాట‌ర్, శానిటేష‌న్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్‌లో.. జ‌ల‌మండ‌లికి ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. ఈ నెల 18వ తేదీన కేర‌ళలో వర్చువల్ విధానంలో ఇన్నోవేష‌న్ ఇన్‌రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ కేట‌గిరిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్, నీటి పొదుపు , సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల అవ‌గాహ‌న కోసం జ‌ల‌మండ‌లి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51 లో నిర్మించిన థీమ్ పార్కు నిర్మాణానికి ఈ అవార్డు ల‌భించింది. వర్చువల్ విధానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల్ శక్తి స‌హాయ మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా ఈ అవార్డును దాన కిశోర్‌కు బ‌హుక‌రించారు.

2018 ద‌స‌రా రోజు ప్రారంభమైన థీమ్ పార్కు..

న‌గ‌ర‌వాసుల‌కు ఇంకుడుగుంత‌లు, నీటి పొదుపుపై అవ‌గాహన క‌ల్పించేందుకు నిర్మించిన రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును 2018 అక్టోబ‌ర్ 18వ తేదిన అప్ప‌టి తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.కె. జోషి చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. దాదాపు రూ. 3 కోట్ల‌తో నిర్మించిన ఈ థీమ్ పార్కులో భ‌వ‌నాల్లో, కాలువ‌ల్లో ఏ విధంగా నీటి పొదుపు చేయ‌వ‌చ్చో తెలియ‌జేసే నిర్మాణాలు ఉంటాయి.

నీటిని సంర‌క్షించే ప‌ద్దతులు..

నీటిని ఓడిసి ప‌ట్టే ప‌ద్ధతులకు చెందిన 42 ర‌కాల న‌మూనాలు ఈ పార్కులో నిర్మించ‌బ‌డ్డాయి. పిల్లలకు నీటి విలువ‌ను గురించి తెలియ‌జేసే యానిమేష‌న్ వీడియోలు, కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి హైద‌రాబాద్ మ‌హాన‌గరానికి మంచినీటిని త‌ర‌లిస్తున్న త్రీడి రూపంలో ఉన్న‌ వీడియోలు ఇందులో ప్ర‌ద‌ర్శిస్తారు. నీటి సంర‌క్ష‌ణ కొర‌కు పార్కులో ఏర్పాటు చేసిన నిర్మాణాలు విద్యార్థుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

మాట్లాడే చెట్టు..

ముఖ్యంగా పార్క్‌లో ఏర్పాటు చేసిన మాట్లాడే చెట్టు విద్యార్థుల‌ను క‌ట్టిపడేస్తుంది. ఈ చెట్టు, అడ‌వుల వల్ల వ‌ర్షాలు ఎలా కురుస్తాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు అడ‌వుల వ‌ల్ల‌ ప్ర‌యోజ‌నాల గురించి వివ‌రిస్తుంది. అంతేకాకుండా, గొడుగు ఆకారంలోని నాలుగు గ‌జెటోల‌ను నిర్మించారు. వాన‌నీరు వీటిపై ప‌డ‌గానే ఆ నీరు ప్ర‌క్క‌నే ఉన్న సంపులోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. విద్యార్థుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు ర‌కాల ఆట‌ల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక్క‌డ ఏర్పాటు చేసిన భారీ స్కేలుపై మ‌నిషి నిల‌బ‌డితే ఆ వ్య‌క్తి ఒంట్లో ఎంత నీరు ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. వీటితోపాటు 5 నిమిషాల నిడివితో కూడిన‌ వాన‌నీటి సంర‌క్షణ చ‌ర్య‌లు సులువుగా అర్థ‌మ‌య్యేలా చోటాభీమ్ వీడియోలు రూపొందించారు.

విదేశీ సందర్శకుల తాకిడి..

2018లో ప్రారంభ‌మైన ఈ పార్కును ఇప్ప‌టివ‌ర‌కు దేశ విదేశాల నుంచి వ‌చ్చిన ప్రతినిధులు సంద‌ర్శించారు. అంతేకాకుండా, న‌గ‌రంలోని ప‌లు క‌ళాశాల‌, పాఠ‌శాలకు చెందిన‌ 20వేలకు పైగా విద్యార్థులు పిక్‌నిక్‌కు వచ్చారు. కాన్పూర్, త‌మిళ‌నాడుల‌లో ఈ త‌ర‌హా థీమ్ పార్కును నిర్మించుకోవ‌డానికి జ‌ల‌మండ‌లి నుంచి థీమ్ పార్కుకు చెందిన‌ సాంకేతిక, నిర్మాణ వివరాలను అధికారులు సేకరించరంటే పార్కు ప్రత్యేకత అర్దం చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed