జగన్ బయటకు రాడు..నన్ను వెళ్లనీయడు : రఘురామకృష్ణంరాజు

by srinivas |
raghurama krishnam raju,
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంపి గా సిగ్గుపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం వెళ్తున్న మహిళలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అమరావతి కోసం 405 రోజులుగా నిరసన తెలుపుతున్నమహిళలకు మా మహిళా హోం మంత్రి కూడా స్పందించకపోవడం దయనీయమన్నారు.

మహిళలపై జరుగుతున్న దాడులను పురుషులు ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. రాష్ట్రంలో అసలు మగాల్లున్నారా అన్న సందేహం కలుగుతుందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇన్ని అరాచకాలు చేయడం ఒక్క వైసీపీకే సాధ్యమైందంటూ సెటైర్లు వేశారు. ఎన్నికలు లేని ప్రజాస్వామ్యం ఏమిటో అర్థం కావట్లేదన్న రఘురామకృష్ణం రాజు.. చిత్తూరు, కడపలో జరుగుతున్న ఏకగ్రీవాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎన్నికల్లో స్థానిక నాయకులను కాదని మీ నెల్లూరు రెడ్డికి అధికారం ఇవ్వడం అది వైసీపీకే చెల్లుతుందంటూ విమర్శించారు.

”కులపిచ్చి పరాకాష్టకు చేరింది. ఉన్న పోస్టులు అన్ని కూడా ఒక సామాజికవర్గానికి ఇచ్చారు. విశాఖలో ఒకపార్టీకే మధ్యం దొరుకుతోంది. ఆ పార్టీకే ధనబలం ఉంది. విశాఖలో అభివృద్ధి ఏమీ జరగకపోగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు” అని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. విశాఖలో రాజధాని వద్దని ఆ ప్రాంత ప్రజలే అంటున్నారని..అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందే వరకు రాజధాని అక్కడే ఉంటుందని చెప్పి ఆ తర్వాత మాట మారుస్తారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ బయటకు రావట్లేదని..తనను తన నియోజకవర్గం వెళ్లనీయడం లేదని అన్నారు. చివరికి ప్రతిపక్ష నేతను కూడా స్వేచ్ఛగా తిరగనియ్యడం లేదని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.

తనపై సీఎం జగన్, రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరిస్తూ తన తోటి ఎంపీలకు లేఖలు రాసినట్లు చెప్పుకొచ్చారు. చెత్త మంత్రులకు వారి బూతు పురాణాలు, అరాచకాలకు లయకర్త సీఎం జగనేనని ఆరోపించారు. దళితుల రిజర్వేషన్ ను కొల్లగొడుతున్న క్రిస్టియన్లకు అభ్యంతరం చెప్పినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. క్రిస్టియన్లుగా డిక్లరేషన్ తీసుకున్న అందరినీ దళితులు కాదని ప్రకటించాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కోరనున్నట్లు చెప్పుకొచ్చారు. సీఎం జగన్ కూడా క్రిస్టియన్ అయినందు వల్లే తన అభ్యంతరాలపై కక్ష పెంచుకున్నారంటూ రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed