ప్రభుత్వానికి రాష్ట్ర రియల్​ ఎస్టేట్​ అసోసియేషన్ కీలక డిమాండ్

by Shyam |   ( Updated:2021-06-11 07:17:58.0  )
Lands for sale
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన భూములను పేదలకు పంచాలని తెలంగాణ రాష్ట్ర రియల్​ ఎస్టేట్​అసోసియేషన్​ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్​ అన్నారు. ప్రజల ఆస్తిని అమ్ముతామంటే కుదరదని, ప్రజల ఆమోదం కావాలని తెలిపారు. 27 జిల్లాల్లో వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు. ఈ భూములను పేదలకు పంచాల్సిందేనని డిమాండ్​చేశారు.

కనీసం దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి అంశాన్ని గుర్తించాలన్నారు. భూముల అమ్మకాన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు వ్యతిరేకించాలని కోరారు. ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా అమ్ముకుంటూ పోతే ఇక ఏం మిగలదన్నారు. ప్రభుత్వ భూములు ఒడిసిన తర్వాత ఏం అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతారో చెప్పాలని డిమాండ్​చేశారు. అధికారాన్ని నిలపుకోవడానికి ఓట్లు రాల్చే పథకాలు పెట్టి, ఉచిత పథకాలకు ప్రజలను బానిసలను చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ప్రభుత్వ పెద్దలు వివరించాలన్నారు.

భవిషత్తులో అనేక రకాల పన్నులు వేస్తే తప్ప ప్రభుత్వం నడవని పరిస్థితికి దిగ జార్చారని విమర్శించారు. ప్రతి పక్షాలు ఉద్యమించకపోతే వారి ఉనికినే ప్రజలు గుర్తించరన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed