మార్కెట్‌లోకి నానో యూరియా.. రైతులకు తప్పని కష్టాలు

by Shyam |   ( Updated:2021-07-17 11:19:09.0  )
Nano urea
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు యూరియా పాట్లు మొదలయ్యాయి. మార్కెట్లోకి కొత్త రకం నానో యూరియాను ప్రవేశిస్తుండటంతో ప్రభుత్వం సాధారణ యూరియా దిగుమతులను తగ్గించింది. దీంతో మార్కెట్లో యూరియా కొరతతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. రూ.264 ఉన్న యూరియాను రూ.300 నుంచి రూ.350 వరకు ధరలను పెంచి ప్రైవేటు డీలర్లు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. నానో యూరియాపై క్షేత్ర స్థాయిలో అవగాహనలు కల్పించకపోవడంతో కొత్త యూరియాను వినియోగించేందుకు రైతులు సంకోచిస్తున్నారు.

ప్రతి ఏటా ఎదురయ్యే యూరియా కొరత ఈ ఏడాది మరింత తీవ్రతరమైంది. ప్రభుత్వ విధానంతో మార్కెట్‌లో సాధారణ యూరియా ధరకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో అధికంగా 80లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న పత్తి పంటకు, 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న వరి పంటలకు సరిపడా సాధారణ యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పత్తి పంటలో మొలకలు వచ్చిన తరవాత పంట ఏపుగా పెరిగేందుకు అవసరమైన యూరియా సరైన సమయానికి అందించకపోవడంతో పంట పెరుగుదలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిన సాధారణ యూరియా సరఫరా

సాధారణ యూరియా సరఫరా రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వం మార్కెట్‌లోకి కొత్త రకం నానో యూరియాను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సాధారణ యూరియాను దిగుమతులను తగ్గించింది. దీంతో యూరియాకు మార్కెట్ లో ఒక్క సారిగా డిమాండ్ ఏర్పడింది. 50కిలోల యూరియా బస్తాకు రూ.264 ధర ఉండగా వీటిని మార్కెట్ లో రూ.300 నుంచి రూ.350 వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన ధరలతో సాగు ఖర్చు 20శాతం వరకు పెరిగిందని సతమతమవుతున్న రైతులకు యూరియా కొరత కారణంగా అధిక ధరలకు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నానో యూరియాపై కొరవడిన అవగహనలు

నానో యూరియాను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వీటి వినియోగంపై రైతులకు అవగాహనలు చేపట్టడం లేదు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాను ఏ విధంగా వినియోగించాలి, వీటి ప్రభావం పంటలపై ఏ విధంగా ఉంటుందనే అంశాలను రైతులకు వివరించడం లేదు. సాధారణ యూరియాను వినియోగించేందుకు అలవాటు పడిన రైతులు నానో యూరియాను వాడకంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంటలకు యూరియాను అందించే సమయం ఆసన్నం కావడంతో రైతులు ప్రస్తుతం అందుబాటులో ఉండే సాధారణ యూరియాను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Next Story