యురేనియం మాకొద్దు.. మా బతుకులు ఛిద్రం చేయొద్దు

by Sridhar Babu |   ( Updated:2021-10-21 01:05:00.0  )
Ureniam12
X

దిశ ప్రతినిధి, నల్గొండ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే దీనికి కారణం. నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి నెలవు. దీనికితోడు అడవి అందాలకు, జంతువులకు నివాస ప్రాంతం. ఈ ప్రాంతంలో మరోసారి యురేనియం తవ్వకం కలకలం రేపుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా.. దానిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం, యురేనియం కార్పొరేషన్ ముందుకు సాగుతోంది. ఇటీవల ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఈ ప్రాంతంలో రూ. లక్షల కోట్లు విలువ చేసే యురేనియం నిక్షేపాలు నిల్వ ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

2002 నుంచే సర్వే

దేవరకొండ, చందంపేట, పీఏపల్లి మండలాల్లో యురేనియం నిక్షేపాల కోసం 2002 నుంచే అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, భారత అణుపరిశోధన సంస్థలకు అప్పగించింది. అప్పటి నుంచి ఆయా సంస్థల అధికారులు దేవరకొండ నియోజకవర్గంలో సంచరిస్తూ యురేనియం నమునాలు సేకరిస్తున్నారు. చందంపేట మండలం చిత్రియాల గుట్టల్లో, పెద్దమూల గ్రామంలో 1000 హెక్టార్లు, పీఏపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీభూమి, 196.71ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే యూసీఐఎల్‌ అధికారులు నిర్ధారించారు. కాగా, యురేనియం సర్వే, తవ్వకాలను మొదటి నుంచే స్థానికులు వ్యతిరేకిస్తూ పలు ఆందోళనలు కూడా చేశారు.

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి, ముదిగొండ పరిధిలో 200 ఎకరాలు, చందంపేట మండలం చిత్రియాల, పెద్దమునిగల్‌ గుట్టల్లో 2500 ఎకరాలు, పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం, పెద్దగట్టు పరిసర గ్రామాల్లో 210 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లో కనుగొన్నారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కృష్ణా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో స్థానికులు ఆ తవ్వకాలను అడ్డుకున్నారు. 2003 ఆగస్టులో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఆర్‌పీ సిసోడియా ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ ప్రయత్నాలను ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. 2005లో శేరిపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. 2008 నుంచి అణుశక్తి సంస్థ ఖనిజాన్వేషణ మొదలు పెట్టింది. 2014 వరకు ఈ అన్వేషణ కొనసాగింది. ఇవి లభ్యం కావడంతో పెద్దగట్టు, నమ్మపురం, కోమటి కుంట తండా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనుమతుల కోసం అణుశక్తి విభాగం ప్రతిపాదన పంపింది. నాగార్జున సాగర్ ప్రాంతంలోని నిడ్గుల్ రక్షిత అటవీ ప్రాంతంలోని 7 చదరపు కిలో మీటర్లు, అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్ కు సంబంధించిన 87 చదరపు కిలో మీటర్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వేకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

నాగార్జునసాగర్ ప్రాంతంలో గతవారం రోజులుగా యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) యువ శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు సమీపంలోని నల్లమల గుట్టలను సందర్శించింది. సర్వే నిర్వహించారు. 18 మంది యువ శాస్త్రవేత్తలు యూసీఐఎల్‌ ఆధ్వర్యంలో పెద్దగట్టు, నంభాపురంలో యురేనియం నిక్షేపాలను గుర్తించిన గుట్టలపై సంచరించారు. నమూనాల కోసం గతంలో తవ్విన బోరుబావులను పరిశీలించారు. మట్టి నమూనాలు సేకరించారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లో యురేనియం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెద్దగట్టు – నంభాపురం ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అటామిక్ మినర్స్ డైరెక్టర్ ఇచ్చిన నివేదిక సంచలనం రేపుతోంది. పెద్దగట్టు – నంభాపురం పరిసరాల్లో గతేడాది 25బోరు బావుల్లో నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. L21శాంపిల్స్‌లో అత్యంత ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే దశాబ్ద కాలంగా పెద్దగట్టు గ్రామస్తులు భూగర్భ జలాలను తాగునీటికి వినియోగించడం లేదు. కేవలం వ్యవసాయానికి మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు. అటు నంభాపురం నుంచి 8 కిలో మీటర్ల పరిధిలో నీటి నమూనాలను అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ సేకరించింది. దాదాపు 8 నెలల పాటు శాంపిల్స్ సేకరించి జరిపిన పరీక్షల్లో యురేనియం స్థాయి 2 వేల 168 పీపీబీ ఉన్నట్లు నిర్ధారించింది.

వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు

‘యురేనియం మాకొద్దు.. బతుకులు ఛిద్రం చేయొద్దు..’ అంటూ నల్గొండ జిల్లాలో పలు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రభుత్వాలు మొండిగా ముందుకెళితే ప్రతిఘటిస్తామని, ప్రత్యక్ష ఆందోళనలకు వెనకాడమని హెచ్చరిస్తున్నారు. పెద్దగట్టు, నమ్మ పురం, బాసుని బాయి తండా, కేకే తండా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యురేనియం ప్రాజెక్టుతో గ్రామాలకు గ్రామాలే నామరూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉందని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పచ్చని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం చిచ్చుపెడుతోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed