హైదరాబాద్ టు సిద్దిపేట.. సిరిసిల్ల పెద్దమ్మ గుడిలో ఆత్మహత్య!

by Sridhar Babu |   ( Updated:2021-04-15 08:38:52.0  )
హైదరాబాద్ టు సిద్దిపేట.. సిరిసిల్ల పెద్దమ్మ గుడిలో ఆత్మహత్య!
X

దిశ, సిరిసిల్ల : అతడిది ఈ ప్రాంతం కాదు.. తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు.. ఏ విషయంలో మనస్తాపం చెందాడో.. ఎందుకు చనిపోవాలనుకున్నాడో తెలీదు. ఊరు కాని ఊరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుషాపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి కిటికికి గురువారం ఉరివేసుకొని ఓ వ్యక్తి కనిపించాడు. అతనిది నాగర్ కర్నూల్ జిల్లాగా గుర్తించారు. మృతి చెందిన ప్రాంతంలో ఉన్న అతడి బైక్ నంబర్ ఆధారంగా మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా తలకొండ గ్రామానికి చెందిన పరిమళ రాజ్ కుమార్(27)గా గుర్తించారు. నాగర్ కర్నూల్‌కు చెందిన అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు..? ఇక్కడే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేమిటి..? పెద్దమ్మ గుడి ఆలయం ఆవరణలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? అనేది తెలియాల్సి ఉంది.

మృతుడి వద్ద లభించిన మొబైల్ లాక్ ఓపెన్ కాకపోవడంతో కాల్ డేటా ఇంకా తెలియరాలేదు. అతని బైక్ పేపర్స్‌లో దొరికిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయగా మృతుడు కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని దిల్ సుఖ్‌నగర్‌లోని ఓ హోటల్లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. అయితే, రాజ్ కుమార్ సిద్దిపేటకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అతని బంధువులు తెలిపారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లి.. అక్కడ ఆ అమ్మాయిని కలిసి ఉంటాడని, వారి మధ్య ఏమైనా గొడవలు జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన రాజ్ కుమార్ సిద్దిపేట నుంచి సిరిసిల్ల వైపుకు వెళ్లి మధ్యలో అంకుషాపూర్ పెద్దమ్మ గుడి ఆవరణలో బలవన్మరణానికి పాల్పడి వుంటాడని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట ఎందుకు వెళ్లాడు.. తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాడు.. అసలు ఆత్మహత్యకు కారణాలేంటి..? అనే విషయాలను అతని మొబైల్ కాల్ డేటా బహిర్గతం చేయనుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story