చిరంజీవి రాజకీయాలు వదిలేశారు.. అవన్నీ పుకార్లే: నాగబాబు

by srinivas |
చిరంజీవి రాజకీయాలు వదిలేశారు.. అవన్నీ పుకార్లే: నాగబాబు
X

ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన సోదరుడు, సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో చిరంజీవి రాజకీయ భవిష్యత్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వైఎస్సార్సీపీ పార్లమెంటుకి పంపనుందన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, చిరంజీవి రాజకీయాలను వదిలేశారని అన్నారు. సినిమాలే ప్రస్తుతం ఆయన తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. తమ కుటుంబంలోని నటులందరికంటే చిరంజీవే బిజీగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేయాలని నిర్ణయించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నారని, ఈ ఏడాది చివర్లో మరోసినిమా చేస్తారని ఆయన వెల్లడించారు.

చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. తన సోదరుడికి అన్ని పార్టీల్లోనూ స్నేహితులు ఉన్నారని అంత మాత్రాన ఆయన ఆయాపార్టీలకు వంతపాడుతున్నట్టు అనుకుంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తన సోదరుడు ఏ పార్టీతోనూ సంబంధాలు కలిగి లేడని చెప్పిన నాగబాబు, పవన్ కల్యాణ్‌కు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్ కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు.

మరోపరస్పర విరుద్ధమైన వ్యాఖ్య చేస్తూ… ఒకే రంగంలో ఇద్దరన్నదమ్ములు ఎందుకన్న ఆలోచనతో రాజకీయాలకు చిరంజీవి దూరమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. సినీ రంగంలో చిరంజీవితో పాటు పలువురు నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ తనకంటే అద్భుతంగా ప్రజలకు సేవచేయగలడని చిరంజీవి భావిస్తున్నారని నాగబాబు చెప్పారు. చిరంజీవి ఇంటి ముందు ధర్నాచేయాలని కొంత మంది ప్రతిపాదించారని, ఆయనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని నాగబాబు హితవు పలికారు.

Tags: nagababu, chiranjeevi, pawan kalyan, ap, politics

Advertisement

Next Story

Most Viewed