నాచారంలో నానా ఇబ్బందులు.. మొర పెట్టుకున్నా కనికరం చూపట్లే

by Sridhar Babu |   ( Updated:2021-12-02 07:50:12.0  )
Water-Problem1
X

దిశ, నాచారం: కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. కాలనీలో మౌలిక సదుపాయాలు కొరవడటంతో అవస్థలు పడుతున్నారు. నాచారం డివిజన్ ప్రజలు నీటి కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. మంచినీరు దేవుడెరుగు.. కనీసం వాడకపు నీరు కూడా అందించలేని దుస్థితిలో ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ప్రజలకు నీటి సదుపాయం అందించాలనే సదుద్దేశంతో నాచారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలో పదుల సంఖ్యలో చేతిపంపులు, ట్యాంకు లు ఏర్పాటు చేశారు. అయితే.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతి పంపులు, ట్యాంక్ లు నిరుపయోగంగా మారి అలంకరణ వస్తువులుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. శ్రీరామ్ నగర్ లో బోర్లు, నీటి ట్యాంకుల మరమ్మతుల గూర్చి అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు వెంకటేశ్ ఆరోపించారు.

స్పందించని అధికారులు

నీటి సమస్య పరిష్కారానికి స్థానికులు పలు మార్లు ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారుల్లో చలనం లేదు. ఈ విషయంపై దిశ ప్రతినిధి అధికారులను సంప్రదించగా స్పందించలేదు.

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఈ విషయమై నాచారం కార్పొరేటర్ సాయిజెన్ శాంతి శేఖర్ ను వివరణ కోరగా… నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు స్పందించని తరుణంలో సొంత ఖర్చులతో ఎర్రకుంటలో సుమారు రూ.50 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలన్నారు. లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

Next Story