గర్భిణులకు ఉపయోగపడే స్మార్ట్‌బ్యాండ్

by Shyam |
గర్భిణులకు ఉపయోగపడే స్మార్ట్‌బ్యాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మారుమూల గ్రామాలతో పాటు చిన్న చిన్న పల్లెల్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. డెలివరీ కేసులు లేదా పాము కాటుకు గురైన సందర్భంలో.. సమీపంలోని పట్టణాస్పత్రులకు చేరుకునేలోగా పేషెంట్లకు ఏమైనా జరగొచ్చు. అయితే ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో మైసూరుకు చెందిన దీప్తి ఘనాపాటి హెగ్డే.. కొవిడ్ 19 సింప్టమ్స్‌తో పాటు పదిరకాల శరీర రుగ్మతలను ముందుగానే తెలుసుకునే డివైజ్‌ను రూపొందించింది. ఇందుకు గాను ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో ఫస్ట్ ప్రైజ్ సాధించడంతో పాటు రూ.25వేల నగదు బహుమతి కూడా అందుకుంది.

సాధారణంగా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు జబ్బు చేస్తే.. వైద్యులు, ఆస్పత్రులు అందుబాటులోలేక ఎన్ని అవస్థలు పడతారో తెలిసిందే. ఇక గర్భిణులు, వృద్ధులు, కార్డియక్ పేషెంట్స్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుంది. అందుకే గ్రామీణ ప్రజల ‘పర్సనల్ సెన్సార్ డేటా’ను సేకరిస్తూ బాడీ టెంపరేచర్, బీపీఎమ్, కాఫ్, కోల్డ్ వంటి కొవిడ్ సింప్టమ్స్‌తో పాటు గుండె పనివిధానంలో వచ్చే మార్పులు, గర్భిణుల్లో తలెత్తే అనారోగ్యాలను ముందుగానే గుర్తించి, సదరు వ్యక్తులను అలర్ట్ చేసేలా దీప్తి స్మార్ట్ బ్యాండ్‌ను రూపొందించింది. మొబైల్ యాప్‌తో లింక్ చేసుకుంటే బ్యాండ్ పెట్టుకున్న వ్యక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే అలర్ట్ నోటిఫికేషన్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్యులు, అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో పాటు లైవ్ లోకేషన్ షేర్ చేస్తుంది.

‘రూరల్ హెల్త్ కేర్ అనేది భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. మన దేశంలో 70 శాతం ప్రజలు రూరల్ ఏరియాల్లోనే నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం సవాలుతో కూడుకోగా, డిజిటల్ ఇన్నోవేషన్స్‌తోనే దీనికి పరిష్కారం చూపించొచ్చు. డిజిటల్ రూరల్ ఎంపవర్‌మెంట్ సాధించాలంటే స్మార్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉండాలి. అందుకే నేను ఈ స్మార్ట్ బ్యాండ్ రూపొందించాను. ప్రెగ్నెంట్ మహిళలకు 8 నెలల వరకు 300 రూపాయలతో ఈ బ్యాండ్‌ను రెంట్‌కు కూడా ఇస్తున్నాను’ అని దీప్తి చెబుతోంది.

మైసూరులోని బేస్ పీయూ కాలేజీలో ఫస్ట్ పీయూసీ చదువుతున్న 17 ఏళ్ల దీప్తి ‘బిల్డింగ్ సెల్ఫ్ రిలియంట్ స్మార్ట్ విలేజెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్’ అనే కాన్సెప్ట్ మీద ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌’ (ఐఐఎస్ఎఫ్)లో ఈ ప్రాజెక్ట్ సబ్‌మిట్ చేసింది. ఇందులో 3వేల మంది పార్టిసిపేట్ చేయగా, దీప్తి తొలి స్థానంలో నిలిచి ప్రైజ్‌మనీ దక్కించుకుంది.

Advertisement

Next Story