మండుతున్న మయన్నార్.. పలు ప్రాంతాల్లో మార్షల్ లా

by Anukaran |   ( Updated:2021-03-15 00:25:26.0  )
myanmar protests
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి నిరంకుశత్వాన్ని కొనసాగిస్తున్న సైనిక ప్రభుత్వంపై మయన్మార్‌లో ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి దీనికి వ్యతిరేకంగా గళం విప్పతున్నారు. మరోవైపు ప్రజా ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో దానిని అణచడానికి ఆర్మీ హింసనే నమ్ముకుంటున్నది. ఆదివారం యాంగూన్‌లో జరిపిన ప్రజా ప్రదర్శనలపై సైనిక బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 38 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలతో ఆ దేశంలోని పలు ప్రాంతాలలో మార్షల్ లా (యుద్ధ చట్టం) విధిస్తున్నట్టు సైనిక ప్రభుత్వం ప్రకటించింది.

సైనిక పాలనను వ్యతిరేకిస్తూ మయన్నార్‌లో గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా ఆదివారం యాంగూన్ లోని మూడు గార్మెంట్ పరిశ్రమలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. చైనాకు చెందిన కార్మికులు ఎక్కువ మంది ఈ సంస్థలలో పని చేస్తున్నారు. కాగా.. కొద్దికాలంగా యాంగూన్ ప్రజా యుద్ధక్షేత్రంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడకు వచ్చి ఆర్మీ ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. ఆదివారం కూడా ఇక్కడికి వేలాది మంది నిరసనకారులు చేరుకుని నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసు, సైనిక బలగాలు.. నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. దీంతో 17 మంది మృతి చెందారు.

యాంగూన్‌తో పాటు మాండలే, బాగో, ఫాకాంత్ వంటి ప్రాంతాలలో కూడా నిరంకుశ పాలనపై నిరసన తెలుపుతున్న వారిపైనా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ పలువురు మరణించారు. మీడియా రిపోర్టుల కథనాల ప్రకారం.. ఆదివారం దేశవ్యాప్తంగా ఆర్మీ జరిపిన కాల్పులలో 38 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.

ఆందోళనకారులను అదుపు చేయడానికి సైనిక ప్రభుత్వం కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అదే మార్షల్ లా. యాంగూన్ లోని హ్లైయాంగ్ తర్యార్, ష్వెప్యితా టౌన్‌షిప్ లలో మార్షల్ లా ను విధించారు. దీని ప్రకారం పరిపాలన అంతా యాంగోన్ ప్రాంతీయ కమాండర్ చేతిలోకి వెళ్తుంది. ఈ ప్రాంతాలలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రభుత్వం అడ్డు చెప్పదు.

Advertisement

Next Story

Most Viewed