"ముస్కురాయేగా ఇండియా" … బాలీవుడ్ తారల ప్రయత్నానికి మోడీ ప్రశంస

by Shyam |   ( Updated:2024-06-02 14:52:33.0  )
ముస్కురాయేగా ఇండియా … బాలీవుడ్ తారల ప్రయత్నానికి మోడీ ప్రశంస
X

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజలను కలవర పెడుతోంది. ప్రజలంతా కరోనా వ్యాప్తికి భయపడి ఇళ్లకే పరిమితం కాగా… రహదారులు వెలవెలబోతున్నాయి. ఆప్తులు, మిత్రులను కలిసి బాధలు పంచుకుందాం అంటే సామాజిక దూరం తప్పక పాటించాల్సిన పరిస్థితి. దీంతో కొంత మందిలో నిరాశ, భయం నెలకొంటుంది. ఈ నిరాశ, భయాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు బాలీవుడ్ స్టార్స్. ఈ పాట ద్వారా పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి విరాళాలు అందించే ప్రయత్నం చేశారు. ఈ గొప్ప కార్యానికి అక్షయ్ కుమార్ సారధ్యంలో సెలబ్రిటీలు అందరూ చేతులు కలిపారు.

‌ముస్కురాయేగా ఇండియా సాంగ్ తో భారతదేశంలో నెలకొన్న నిరాశ, నిసృహలను తరిమికొట్టేందుకు యత్నించారు. లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి బయటపడతామని… కరోనా మహమ్మారిని జయించి వీధుల్లో డాన్స్ చేస్తామని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. సిటీలు కళకళలాడుతాయని… గ్రామాల్లో మళ్లీ చిరునవ్వు విరబూస్తుందని… స్నేహితులను కలిసి సంతోషంగా ఉంటూ… నిషేధాజ్ఞలు లేని భారతాన్ని త్వరలోనే చూస్తామంటూ సాగిన పాటను వింటే రోమాలు నిక్కబొడచుకుంటాయి. భారత ప్రజల కలలు ఎగురుతాయని.. మళ్లీ ఇండియాలో చిరునవ్వు విసిగిస్తుందని ఈ పాట ద్వారా జనాల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సాంగ్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌషల్, అయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, కియారా అద్వానీ లాంటి తారలు కనిపించారు. విశాల్ మిశ్రా మ్యూజిక్ అందించి పాడిన పాటకు… కౌశల్ కిషోర్ లిరిక్స్ అందించారు.



‌కాగా బాలీవుడ్ స్టార్స్ ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. ఇండియా మళ్లీ నవ్వుతుంది… విజయం సాధిస్తుందన్న మోడీ… దేశం గురించి చేసిన గొప్ప ప్రయత్నానికి అభినందనలు తెలిపారు.

Tags: Bollywood, Akshay Kumar, Vicky kaushal, Kiara Advani, Ayushman khurana, Muskurayega India

Advertisement

Next Story