మరో ఆరు నెలల్లో వాట్సాప్‌లో జియోమార్ట్!

by Harish |
మరో ఆరు నెలల్లో వాట్సాప్‌లో జియోమార్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని భారీ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్లో కీలకంగా వ్యవహరించేందుకు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ తన ఈ-కామర్స్ విభాగం జియోమార్ట్‌ను రాబోయే ఆరు నెలల్లో వాట్సాప్‌లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. వాట్సాప్‌లో జియోమార్ట్ యాప్‌ను చేర్చడం ద్వారా భారత్‌లోని వాట్సాప్‌కు చెందిన 40 కోట్ల వినియోగదారులకు చేరువ కావొచ్చని రిలయన్స్ సంస్థ భావిస్తోంది. అంతేకాకుండా సంస్థ ఆన్‌లైన్ ఉనికిని మరింత విస్తరించడానికి వీలవుతుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత ఆన్‌లైన్ రిటైల్ రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు జియోమార్ట్ సవాలుగా మారనుంది. దేశీయంగా 200 నగరాల్లో గతేడాది మేలో ప్రారంభమైన జియోమార్ట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో కూరగాయల నుంచి గృహోపకరణాల వరకు అన్నిటినీ జియోమార్ట్ ద్వారా అందించనుంది. ‘జియోమార్ట్‌ను వాట్సాప్ ద్వారా తీసుకురావడంతో ఈ నిర్ణయం రెండు సంస్థలకు కలిసి రానుందని’ కన్వర్జెన్స్ కేటలిస్ట్ వ్యవస్థాపకుడు జయంత్ కొల్లా చెప్పారు.

ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో పట్టు కోసం…

గతేడాది రిలయన్స్ రిటైల్‌లో ఫేస్‌బుక్ సంస్థ 9.9 శాతం వాటా కోసం సుమారు రూ. 42 వేల కోట్లతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం..రిలయన్స్ జియోమార్ట్ విస్తరణకు వాట్సాప్ సహాయం చేయనుంది. రిలయన్స్ రిటైల్ సైతం ఇప్పటికే అన్ని కిరాణా దుకాణాలతో జియోమార్ట్‌ను కనెక్ట్ చేయడం ప్రారంభించింది. దీనివల్ల రిలయన్స్ రిటైల్ ఆర్డర్లు, డెలివరీలను సులభతరం చేసేలా దుకాణాలు లేదా డెలివరీ విభాగం చూసుకోనున్నాయి. జియోమార్ట్ యాప్‌ను రిటైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కిరాణా దుకాణాలు, వినియోగదారులను అనుసంధానం చేసి సాధారణ వాణిజ్య మార్కెట్లో మరింత దూసుకెళ్లాలని రిలయన్స్ లక్ష్యంగా ఉంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ఇప్పటికే ఆఫ్‌లైన్ రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉంది. వాట్సాప్‌తో తాజా ఇప్పందం నేపథ్యంలో ఆన్‌లైన్ విభాగంలోనూ ఆధిపత్యం చెలాయించేందుకు వీలవుతుంది. రిలయన్స్ రిటైల్ తన వార్షిక నివేదిక ప్రకారం..ఇప్పటికే 11,784 రిటైల్ దుకాణాలను నిర్వహిస్తోంది. దేశీయంగా 7 వేల పట్టణాలు, నగరాల్లో విస్తరించి ఉంది. ఇటీవల బిగ్‌బజార్ లాంటి అతిపెద్ద రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలను నిర్వహిస్తున్న ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌తో ఒప్పందం సంస్థ విస్తరణకు మరింత దోహదం చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed