లండన్‌లో ముఖేశ్ అంబానీ రెండో ఇల్లు.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Harish |
లండన్‌లో ముఖేశ్ అంబానీ రెండో ఇల్లు.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సంపన్నుడు, ఆసియాలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కుటుంబం కోసం మరో ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో ఉన్న ‘ఆంటిలియా’ తర్వాత మరో ఇంటి అవసరం ఉందని ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు. అందుకోసం లండన్, బకింగ్ హామ్‌లో ఉన్న స్టోక్‌పార్క్‌లో 300 ఎకరాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 49 బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉంది.

దాని కోసం ఆయన రూ.592 కోట్లను ఖర్చు చేసినట్టు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా లండన్‌లోని ఇల్లు సువిశాలంగా ఉందని, దీనినే ముఖేష్ అంబానీ ప్రాథమిక నివాసంగా మార్చుకోవాలని భావిస్తున్నారని, ఇప్పటికే కుటుంబానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో అత్యాధునిక వైద్య సదుపాయంతో పాటు ఇంకా ఇతర విలాస వంతమైన వస్తువులు ఉండనున్నాయి. వాటితో పాటుగా ముంబైలోని యాంటిలియాలోని అన్ని అవసరాలను తీర్చే విధంగా ఈ ఇంటిని నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది దీపావళిని ముఖేశ్ అంబానీ కుటుంబం లండన్‌లోని ఇంట్లోనే జరుపుకున్నారని తెలుస్తోంది. సాధారణంగా అంబానీ కుటుంబం ‘ఆంటిలియా’లో దీపావళి జరుపుకునేవారు. ఈ ఏడాది లండన్‌లోని కొత్త ఇంట్లో జరుపుకోగా, తిరిగి భారత్‌కు రానున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత అక్కడికి వెళ్లనున్నట్టు కథనం పేర్కొంది.

Advertisement

Next Story