ప్రభుత్వాలే అలా చెప్పడం సరికాదు.. ముద్రగడ పద్మనాభం

by srinivas |
mudragada
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాపు ఉద్యమ నేత లేఖలు రాశారు. ఇరు రాష్ట్రాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో రైతు వెన్నెముక విరిగిపోయిందని.. తడిచిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ధాన్యం పాడైపోయిందని కొనుగోలు చేయడం మానేస్తున్నారని ఫలితంగా అన్నదాత మరింత ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యంతో ఆర్ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని లేఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు.

ఇలా చేయడం వల్ల రైతులకు మరింత లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆ పరిశోధనలు ఫలిస్తే జిల్లాకొక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయోచ్చని సూచించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే దీనికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చినట్లు గుర్తుచేశారు. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకుంటే రైతన్నలు నష్టాల నుంచి గట్టెక్కవచ్చన్నారు. దీంతో ధాన్యాన్ని పండించిన రైతులు న‌ష్టపోకుండా ఉంటార‌ని, ఏ సమస్యలూ ఉండ‌బోవ‌ని చెప్పుకొచ్చారు. మరోవైపు వరి పండించొద్దని, వాణిజ్య పంటలే సాగు చేయాలని ప్రభుత్వాలు చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిత్యం నీరు ఉండే పొలాల్లో వరి త‌ప్ప ఇత‌ర‌ పంటలు వేయ‌డం కష్టమని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed