క్రిమినల్స్‌‌కు సింహ స్వప్నం.. ‘ముధోల్’

by Anukaran |
క్రిమినల్స్‌‌కు సింహ స్వప్నం.. ‘ముధోల్’
X

దిశ, ఫీచర్స్ : ముధోల్ డాగ్.. ఈ పేరు వింటేనే నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ముధోల్ సీన్‌లోకి ఎంటరైతే చాలు.. కాకలు తీరిన క్రిమినల్స్‌కైనా ప్యాంట్లు తడిచిపోతాయి. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగితే క్షణాల్లో అక్కడ వాలిపోయి, ఇట్టే నేరస్థుల్ని పట్టేస్తుంది. ఇంతకీ క్రిమినల్స్‌కు సింహస్వప్నంలా మారిన ఆ ఐదో సింహం ఎవరు? దాని ప్రత్యేకతలేంటో మీరూ తెలుసుకోండి.

బ్యాచ్ నెంబర్ 21.. ట్రైన్డ్ ఎట్ కర్నాటక. 24 అవర్స్ ఆన్ డ్యూటీ. ఏంటీ? మహేశ్‌బాబు ‘పోకిరి’ సినిమా డైలాగ్స్‌లా ఉన్నాయని అనుకుంటున్నారా? కానే కాదు ఇప్పటికే ఇండియన్ ఆర్మీలో సత్తా చాటుతున్న సరికొత్త సైన్యం గురించే ఈ ఇంట్రడక్షన్. విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీసు శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయి. చూసేందుకు అన్నీ ఒకే పోలికతో ఉన్నప్పటికీ ఒక్కో జాతి శునకం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉండటం విశేషం. వీటిలో భారత సంతతికి చెందిన ‘ముధోల్’ జాతికుక్కలు ఇంకాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పుడు వీటికి ట్రైనింగ్ ఇచ్చేందుకు కర్నాటక పోలీసులు రెడీ అయ్యారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కర్నాటక భాగల్ కోట్ జిల్లా పోలీస్ కనైన్ స్క్వాడ్ విభాగంలోకి నెలన్నర వయసున్న దేశీ ముధోల్ జాతికి చెందిన ‘క్రిష్’ అనే జాగిలాలను తీసుకుంటున్నట్లు ఎస్పీ లోకేష్ జగల్సార్ తెలిపారు. ఇటీవల లాబ్రడార్ జాతికి చెందిన జాగిలాన్ని ప్రభుత్వ కుక్కల ఆశ్రమానికి తరలించామని, అయితే తమ బృందంలో లాబ్రడార్ తరహాలో ఉండే మరో జాగిలాన్ని తీసుకోవాలన్న డీఐజీ, ఐజీ ఉన్నతాధికారుల సలహా మేరకు ముధోల్ జాతికి చెందిన కుక్కపిల్లని తీసుకున్నట్లు చెప్పారు. ‘క్రిష్‌’ను స్నిఫర్ డాగ్‌గా ఉపయోగిస్తామని తెలిపారు. డాగ్‌కి 6 నెలల నుంచి 8 నెలల వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జర్మన్ షెపర్డ్స్, డాబర్ మాన్, లాబ్రడార్ డాగ్స్.. స్నిఫర్ డాగ్‌ మాదిరి చక్కటి పనితీరు కనబరుస్తాయని, వాసన పసిగట్టే సామర్థ్యంతో రెప్పపాటులో శత్రువులను కనిపెట్టే గుణం ఉందన్నారు. ఇప్పుడు అదే స్థాయిలో శత్రువుల్ని గుర్తించేలా ‘క్రిష్’కు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రధాని ట్వీట్‌తో వెలుగులోకి..

గతేడాది ఆగస్టు నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ కోసం పాటుపడాలంటూ దేశ ప్రజలకు పలుమార్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్ష రంగం నుంచి ఆట వస్తువుల వరకు అన్ని రంగాల్లోనూ భారత్ స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వదేశీ బ్రీడ్‌ జాగిలాలను పెంచుకోవాలంటూ ప్రజలకు సూచించారు. దీంతో ముధోల్ జాతి జాగిలం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కర్నాటకలోని ముధోల్ టౌన్‌లో 750 కుటుంబాలు ఈ సంతతి కుక్కలను పెంచుకుంటున్నాయి.

‘ముధోల్’ పేరు ఎలా వచ్చిందంటే..

ఈ జాతి శునకాలు కర్నాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని ‘ముధోల్ హౌండ్, కేర్వాన్ హౌండ్’ అనే రెండు పేర్లతో పిలుస్తారు. కెన్నల్ క్లబ్ ఆఫ్ ఇండియా(కేసీఐ), ఇండియన్ నేషనల్ కెన్నల్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఐఎన్‌కేసీ) వేర్వేరు జాతుల పేరుతో వీటిని గుర్తించాయి. కేసీఐ దీన్ని కేర్వాన్ హౌండ్‌గా, ఐఎన్‌కేసీ ముధోల్ హౌండ్‌గా రిజిస్టర్ చేశాయి. కాగా, కర్నాటకలోని ముధోల్ తాలుకా ఈ బ్రీడ్ శునకాలకు పాపులర్ కావడంతో ముధోల్ హౌండ్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కుక్కల వారసత్వాన్ని గుర్తిస్తూ 2005లో భారత కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ముధోల్ హౌండ్ బ్రీడ్‌పై పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 1920లో ముధోల్‌ సంస్థాన రాజు శ్రీమంత్ రాజాసాహెబ్ మలోజిరావు ఘోర్పాడే.. తమ సంస్థాన గిరిజనులతో ఈ కుక్కలను తీసుకుని వేటకు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. 1937లో సాహెబ్ మలోజీ‌రావ్ లండన్‌కు వెళ్లినప్పుడు అప్పటి కింగ్ ఐదో జార్జ్‌కు ఓ జత ముధోల్ జత కుక్కల్ని బహుకరించారని చరిత్ర చెబుతోంది. ఈ కుక్కలను రాజు సంస్థానానికి కాపలాగా ఉంచడంతో పాటు వేటకుక్కలా ఉపయోగించిన దాఖలాలున్నాయి. కాగా ఈ శునకాలు భవిష్యత్తులో బార్డర్‌లోనూ విధులు నిర్వర్తించనున్నాయి. ప్రస్తుతం బీఎస్ఎఫ్.. మేఘాలయాలోని ట్రయల్ బేసిస్‌లో ఈ జాగిలాలకు ట్రైనింగ్ ఇస్తోంది.

ఫుల్ స్టామినా..

ముధోల్ జాతి కుక్కలను చూస్తే అసలు అవి బతికున్నాయా? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ, వాటికి మహా టెంపర్ ఉంటుంది. దాని పళ్లు, స్టామినా ఇతర కుక్కలతో పోలిస్తే చాలా ఎక్కువ. చూపుల్లోనూ ముధోల్ నెంబర్ వన్. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ 270 డిగ్రీల్లోనూ నిఘా వేయగలదు. మగ కుక్కల ఎత్తు 68 నుంచి 72 సెంటిమీటర్లు కాగా, ఆడ కుక్కల ఎత్తు 64 నుంచి 68 సెంటిమీటర్లు మాత్రమే. ఈ ముధోల్ జాతి ఆడ, మగ కుక్కల బరువు 22 నుంచి 28 కేజీలు ఉండగా వీటి ఆయుర్ధాయం 13 నుంచి 16 ఏళ్లు మాత్రమే.

Advertisement

Next Story