రెవె‘న్యూ’చట్టంతో వీరికి ‘న్యూ’ప్రాబ్లమ్స్..!

by  |   ( Updated:2020-09-09 04:20:36.0  )
రెవె‘న్యూ’చట్టంతో వీరికి ‘న్యూ’ప్రాబ్లమ్స్..!
X

దిశ, న్యూస్‌బ్యూరో: అసెంబ్లీకి బుధ‌వారం తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం రానుంది. వీఆర్వో వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఏకంగా రద్దు చేశారు. అయితే ప్రత్యామ్నాయ విధానాలు లేకుండా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకులకు అపరిమిత అధికారాలు ఉండ‌డం వ‌ల్ల ప్రశ్నించినా, సూచనలు చెప్పే ప్రయత్నం చేసినా ఇబ్బందులకు గురవుతామని ఉద్యోగ సంఘాలు మౌనం వహించాయి. కనీసం కొత్త చట్టం రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించకపోయినా పర్యవసనాలపై కూడా చర్చించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ప్రకటించే విధానంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్ల చేతిలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక రకాల పనులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉండే వారికి ఈ రిజిస్ట్రేషన్ల అధికారం కంటిమీద కునుకులేకుండా చేయనుంది. వారితో జనం పరేషాన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సాధారణంగా ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియకు డాక్యుమెంటేషన్, అప్‌లోడ్, సంతకాలు, వాంగ్మూలం లాంటి చేపట్టేందుకు కనీసం మూడు గంటలైనా పడుతుంది. అలా సమయాన్ని తహసీల్దార్ కేటాయిస్తే మిగతా పనులన్నీ నిలిచిపోవడం ఖాయం. పైగా దాదాపు రోజూ ఏదో ఒక సమావేశం, ప్రోటోకాల్ డ్యూటీలు, మంత్రి, ఎమ్మెల్యే సమావేశాలు, ఎన్నికలు, పరీక్షల ఏర్పాట్ల బాధ్యత తహసీల్దార్లదే. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు.. ఇలా అన్ని పనులకూ రెవెన్యూ శాఖనే కీలకం. అలాంటి సందర్భాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతల నిర్వహణ వారికి ఆమోదమైనా జనానికి ఇక్కట్లకు గురి చేస్తుందని స్పష్టమవుతోంది. మ్యుటేషన్‌లోనే అవినీతి కనబడుతుంటే రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్లకూ మరక అంటుకోదన్న గ్యారంటీ ఏమున్నదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ అలాంటి సంచలనానికే తెర తీశారని, పర్యావసనాలు, ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు.

కబ్జాల నియంత్రణకు వ్యవస్థ ఏది..?

ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకుండా పోతుంది. రోజూ కబ్జాలతో వార్తల్లోకి ఎక్కే గండిపేట, శేరిలింగంపల్లి, శంషాబాద్, కూకట్‌ప‌ల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కీసర, మహేశ్వరం, బాలాపూర్, ఘట్‌కేస‌ర్‌, శామీర్‌పేట‌, మూడుచింతలపల్లి, కందుకూరు, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో వీఆర్వోలు వెళ్లిపోతే ఎంత మంది సిబ్బంది ఉంటారో లెక్క తీస్తే ఐదారుగురికి మించరని తెలుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల సంరక్షణ ఎలా సాధ్యమని ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగర శివార్లలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల రక్షణకు మానవ వనరులు లేకపోతే కష్టమే. సరిదిద్దని రెవెన్యూ రికార్డులతో హక్కుల కోసం ఇరువర్గాల కొట్టుకునే రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ రిటైర్డ్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవదారు కాలమ్‌లో ఉన్న పేర్లను తొలగించి పట్టాదారుడి పేరిటే నింపేశారు. అలాంటి ప్రతి ఊరిలోనూ కనీసం 5 శాతం పట్టాదారుల చేతుల్లో భూములు లేవు. ఇప్పుడీ ఆటోమెటిక్ మ్యుటేషన్ ద్వారా క్రయ విక్రయాలు యథేచ్ఛగా పూర్తవుతాయి. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పంచాయితీలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. విచారణ లేకుండా మ్యుటేషన్ చేయడం ద్వారా గ్రౌండ్ రియాల్టీస్ భిన్నంగానే హక్కుల బదలాయింపు సాగుతుంది.

పైలెట్ ప్రాజెక్టుపై నెగిటివ్ రిపోర్టు..

ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టిన మండలాల్లో రిపోర్టులు నెగిటివ్‌గానే ఉన్నాయి. రోజూ రిజిస్ట్రేషన్ల కోసం జనం గంటల తరబడి వేచి చూడాల్సిందే. రూ.కోట్లు, రూ.లక్షల లావాదేవీలు చోటు చేసుకుంటాయి. చాలా మంది ఆఖరి నిమిషాల్లో రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. అలాంటప్పుడు తహసీల్దార్లకు సమయం దొరక్కపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్టాంపు డ్యూటీ విషయంలో పదేండ్ల అనుభవం తమకే ఒక్కొక్కసారి లెక్క కుదరదని సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రధాన నాయకుడు అభిప్రాయపడ్డారు.

సబ్ రిజిస్ట్రార్ల నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు తప్పించడం ద్వారా జనానికే ఇబ్బంది కలుగుతుందని స్పష్టం చేశారు. డైరెక్ట్ మ్యుటేషన్‌తో అన్యాయం జరిగిందని భావించిన వాళ్లు ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్‌కు అప్పీలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా వ్యవస్థ ఉండదేమోనని, వాళ్లంతా సివిల్ కోర్టుకే వెళ్లాల్సి వస్తుందని ఓ డిప్యూటీ కలెక్టర్ చెప్పారు. దీని ద్వారా అన్యాయానికి గురైన‌ వారికి న్యాయం లభించడం కష్టమేనన్నారు. త

Advertisement

Next Story

Most Viewed