‘నీ మీదా పోలీస్ కేసు బుక్ చేపిస్తా’

by  |
‘నీ మీదా పోలీస్ కేసు బుక్ చేపిస్తా’
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సమాచార హక్కు చట్టం కింద ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల గురించి అడిగిన వ్యక్తిని, మండల అభివృద్ధి అధికారి ఫోన్‌లో బెదిరించారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. దానికి సంబంధించిన ఆడియో నిజామాబాద్ జిల్లాలో వైరల్‌గా మారింది.

‘మండలానికే బాస్ అయిన నేను తలుసుకుంటే నీ ఇంజినీరింగ్ డిగ్రీ, బీఈడీ సర్టిఫికెట్ల సంగతి తెలుస్తా. గ్రామం గురుంచి నీకు ఏమి బాధ కలుగుతుంది. సమాచారం గురుంచి అడగడానికి నీవెవరు, నీకేం పవర్ ఉంది. దానికి సర్పంచ్ మిగితా వాళ్ళు ఉన్నారు కదా. అరగంటలో నావద్దకు రాకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు వస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు.’

ఇలాంటి భాషతో ఎంపీడీవో సంభాషించారు. ప్రస్తుతం ఈ ఆడియో నిజామాబాద్ జిల్లాలోని సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలం, అక్బర్ నగర్ గ్రామానికి చెందిన బురిగెడి సంజీవ్ అనే వ్యక్తి కొన్ని నెలల నుంచి ఉపాధిహామీ పథకంలో జరిగే అవినీతిని గుర్తించారు. తన తల్లిలాగే చాలా మంది పేద కూలీలకు డబ్బులు సరిగ్గా రావడం లేదని, అలాగే అసలు పని చేయని వారికి కూడా డబ్బులు వస్తున్న విషయం గమనించి ఆన్ లైన్ నుండి హాజరు వివరాలు సేకరించాడు. ఆగస్టు 31వ తేదీన సంజీవ్ పంచాయతీ కార్యదర్శిని కలిసి, సమాచార హక్కు చట్టం ద్వారా ఉపాధిహామీ పథకం గత 8 నెలల హాజరు, చెల్లింపులు వివరాలు కావాలని కోరగా ఎంపీడీఓను సంప్రదించాలని కార్యదర్శి సూచించింది.

ఈ విషయంపైన మంగళవారం ఎంపీడీఓ‌ దగ్గరికి వెళ్లక ముందే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ విషయం చెప్పడంతో అట్టి అధికారి తనకు ఫోన్ చేసి “అసలు నీకు ఏం పవర్ ఉందని సమాచారం అడుతున్నావ్, అసలు నీ సంగతి ఏమిటి ? నీపైన పోలీస్ కేసు పెట్టాను, 15 నిమిషాలలో నా దగ్గరికి రాకపోతే మీ ఇంటికి పోలీసులను పంపిస్తాను, అరెస్ట్ చేయిస్తా అని” బెదిరించిన ఆడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం ఐనా సమాచార హక్కు చట్టంను సామాన్యులు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి అనడానికి ఈ సంఘటన ఉదాహరణ గా చెప్పవచ్చు.


Next Story

Most Viewed