"కాణిపాకం వినాయకుడి ముందైనా చెబుతా.. కన్నా అమ్ముడు పోయారు"

by srinivas |
కాణిపాకం వినాయకుడి ముందైనా చెబుతా.. కన్నా అమ్ముడు పోయారు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని టీడీపీ, బీజేపీలు విమర్శిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రోజుకో సంచలన ట్వీట్‌లో ఆసక్తి రేపుతున్నారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్ల రూపాయలకు టీడీపీకి అమ్ముడుపోయారని, బ్రోకర్‌గా బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వ్యవహరించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కన్నా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించగా, సుజనా ఆయనను కుక్కతో పోల్చారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో కన్నాపై విమర్శలు చేశారు.

కన్నా అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం రాష్ట్రానికి ఎంత డబ్బులిచ్చింది, అందులో ఎంత దుర్వినియోగం జరిగిందన్న వివరాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. కన్నా, పురంధేశ్వరి ఎంత తీసుకున్నారు? ఏయే నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారు? అన్న వివరాలు లెక్కలతో సహా తనవద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయా ఖర్చుల వివరాలు అధిష్ఠానానికి అందజేశారా? అని ఆయన ప్రశ్నించారు.

ఆ డబ్బును ఎలా దుర్వినియోగం చేశారన్నది కూడా తాను వివరించగలనని అన్నారు. అయితే అది ఆ పార్టీ అంతర్గత విషయం అయినందున ఆ వివరాలు తాను బయటపెట్టదలచుకోలేదని అన్నారు. తాను చేసిన కన్నా 20 లక్షలకు అమ్ముడుపోయారన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. కావాలంటే కాణిపాకం వినాయకుడి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి ఈ వివరం వెల్లడించేందుకు సిద్ధం.

Tags: ysrcp, mp vijayasai reddy, bjp, kanna, purandeswari

Advertisement

Next Story

Most Viewed