వామన్‌రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

by Sridhar Babu |
వామన్‌రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
X

దిశ, భువనగిరి: హైకోర్టులో నడుస్తున్న పాత కేసుల బండారం బయటపడుతుందనే భయంతోనే.. న్యాయవాద దంపతులను టీఆర్ఎస్ నేతలు అతికిరాతకంగా హత్య చేయించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శీలం రంగయ్య హత్య కేసును హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది వామన్‌రావుకు ప్రాణహాని ఉందని తెలిసినా.. వారికి రక్షణ కల్పించకపోవడం ప్రభుత్వ
వైఫల్యమేనని విమర్శించారు. ప్రభుత్వ ప్రమేయంతో న్యాయవాది వామన్‌రావు దంపతులను దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ న్యాయవాది హత్యకు ముందు జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొనడం గమనార్హమన్నారు. ఉదయం మంథనిలో జన్మదిన వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం 2.30 కు జరిగిన హత్యలో పాల్గొంటాడనే కోణంలో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలరని డిమాండ్ చేశారు. వామన్‌రావు దంపతుల దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యాన్ని తెలియజేస్తుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని.. నిందితుల తరుపున కోర్టులో న్యాయవాదులెవరు వాదించవద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story