సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి సూటి ప్రశ్న

by Anukaran |   ( Updated:2020-07-25 06:49:32.0  )
సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ శనివారం బహిరంగ లేఖ రాశారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున వారంరోజుల్లో రాష్ట్ర రైతులు అబ్బురపడే విధంగా గుడ్‌న్యూస్ చెబుతా అన్నారని, కానీ ఆ విషయం చెప్పి రెండు నెలలు గడుస్తున్నా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. గతంలో చాలా హామీలు ఇచ్చారని మండిపడ్డారు. దళితులను సీఎం చేస్తానని, డబుల్ బెడ్ రూం, గిరిజనులకు మూడెకరాల భూమి.. రైతులకు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీని విస్మరించారని అన్నారు. రూ.26 వేల రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు.

సీఎంగా ఇచ్చిన హామీని విస్మరించడం ఎంతవరకు సమంజసమన్నారు. మిగతా హామీల లాగే ఇది కూడా బోగస్ హామీనేనా అని, వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. లేకుంటే రైతులకు కేసీఆర్ క్షమపణ చెప్పాలన్నారు. వర్షాల వల్లే చెరువులు నిండాయి తప్ప సీఎం కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో 90శాతం పూర్తయినా ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టును కేసీఆర్ విస్మరించారని, కాళేశ్వరం ద్వారా సీఎం కమీషన్లు దండుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని లేఖలో ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed