సొంత బిడ్డనే గెలిపించుకోలేదు.. గెల్లును ఎలా గెలిపిస్తారు..?: అర్వింద్

by Sridhar Babu |
సొంత బిడ్డనే గెలిపించుకోలేదు.. గెల్లును ఎలా గెలిపిస్తారు..?: అర్వింద్
X

దిశ, వీణవంక: హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని మామిడాలపల్లి, చల్లూరు, కిష్టంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినందుకే ఇన్నేండ్లుగా గెలిపిస్తున్నారని చెప్పారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డినే ఓడించామని, హుజూరాబాదులో ఈటలను ఓడించడం కష్టమా అని కేటీఆర్ అంటున్నారంటూ గుర్తు చేశారు. కానీ, నిజామాబాద్‌లో కవితను బీజేపీ ఓడగొట్టిందన్నారు. సీఎం కేసీఆర్ సొంత బిడ్డనే కాపాడుకోలేకపోయాడు.. ఇక హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను కాపాడగలరా అంటూ అర్వింద్ ప్రశ్నించారు.

నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ గెలుస్తామన్న ధీమాతోనే వెళ్ళారని.. కానీ, ఓటమి భయంతో దుబ్బాక, హుజూరాబాద్‌కు రాలేదని ఎంపీ అర్వింద్ చురకలు వేశారు. ఈటలను గెలిపిస్తే ఏం వస్తది.. ఇంకో రెండున్నర సంవత్సరాలు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని, నిజానికి ఈటలను గెలిపిస్తే ముఖ్యమంత్రికి సోయి వస్తుందని ఆయన సెటైర్లు వేశారు. కమలం పువ్వు గుర్తుమీద ఓటు వేసి ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, రామిడి ఆదిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed