ఎర్రబెల్లి నీ నాయకత్వాన్ని మడిచి దొరల గడిలా పెట్టుకో..

by Sridhar Babu |   ( Updated:2021-07-09 12:12:43.0  )
ఎర్రబెల్లి నీ నాయకత్వాన్ని మడిచి దొరల గడిలా పెట్టుకో..
X

దిశ, జగిత్యాల : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ఆయన.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. గత వారం కిందట ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ ఎంపీల గురించి చేసిన కామెంట్స్ పై అరవింద్ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీలపై మాట్లాడే హక్కు ఎర్రబెల్లికి లేదన్నారు. నీ నాయకత్వాన్ని మడిచి దొరల గడిలా పెట్టుకోవాలని సూచించారు.

గ్రామీణ సడక్ యోజన రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్‌లో 60 శాతం నిధులు కేంద్రం ఇస్తేనే మీరు పబ్బం గడుపుతున్నారని, మీకు కమీషన్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని ఎర్రబెల్లిని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆహ్వానిస్తున్నామని, జిల్లా ఆస్పత్రిలో 80 శాతం సిబ్బంది లేకపోవడంతో గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం బీజేపీ పార్టీ తరఫున ముందుకు వెళ్తున్నామన్నారు. ఆయనతోపాటు ఎంపీ సోయం బాపురావు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story