మాఫియాకు అడ్డగా మారిన సిరిసిల్ల : బండి సంజయ్

by Sridhar Babu |
మాఫియాకు అడ్డగా మారిన సిరిసిల్ల : బండి సంజయ్
X

దిశ, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జిల్లాలోని అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలను కేసీఆర్ హోల్ సేల్‌గా కొనేశారని విమర్శించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఊదితే ఊడిపోతుందని సెటైర్లు వేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం మాఫియాకు అడ్డాగా మారిందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చెక్ డ్యామ్‌లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరిట ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు.అక్రమ దందాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు, వారి అక్రమాలపై ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలపై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు మంత్రి మోచేతి నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారుల లిస్టును తయారు చేస్తున్నామన్నారు. ఇలానే వ్యవహరిస్తే నేనే డైరెక్ట్‌గా పోలీస్‌స్టేషన్‌కు వస్తానని, తమ కార్యకర్తలను పోలీసులు వేధిస్తే ఊరుకోమని హెచ్చరించారు. నాలుగు వర్షం చినుకులకే సిరిసిల్ల మునిగింది ఇదేనా కేటీఆర్ చేసిన అభివృద్ధి..? అని ఆయన ప్రశ్నించారు. లింగన్నపేట వద్ద బ్రిడ్జి కట్టించలేని మంత్రి బీజేపీని విమర్శిస్తారా..? అంటూ కౌంటర్స్ వేశారు. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్ ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. గంభీరావుపేటకు కేంద్రం నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులు మంజూరు చేశామని తెలిపారు.

కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికే తెలంగాణ వచ్చిందా..? అని ప్రశ్నించారు. బీజేపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందన్నారు.కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో రైతు వేదిక, వైకుంఠధామాలు నిర్మించి పింక్ కలర్ వేస్తున్నారని విమర్శించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు ఇస్తానన్న నిధులు ఇంకా ఇవ్వలేదన్నారు. సర్పంచ్‎లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, వారిని ఆస్తులు అమ్ముకునే దుస్థితికి తీసుకొచ్చారని కేసీఆర్ పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ లో 20 మంది సర్పంచులు రాజీనామా చేశారని చెప్పారు. పేరుకు మాత్రమే ఎంపీటీసీ వాళ్లకి ఎలాంటి అధికారం లేదని ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని ఏ ముఖ్యమంత్రి అయినా అంటాడా..? అని ప్రశ్నించారు.పంట మార్పిడి విధానానికి తాను వ్యతిరేకం కాదని.. కానీ భూసార పరీక్షలు నిర్వహించి పంట మార్పిడి చేయాలన్నారు. సన్నవడ్లు పండించే రైతుల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు.వరి వేస్తే ఉరే అంటూ రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పంట దిగుబడి ఎక్కువ వస్తే దానికి తగ్గ ప్రణాళిక ఏదని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు.

దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ప్రతీ నియోజకవర్గనికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అక్టోబర్‎లో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. బీసీ, బడుగు, బలహీన వర్గాలకు దళిత బంధు లాంటి పథకాల్ని తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో హిందువులు పండుగలను జరుపుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని మోడీ, అమిత్ షా తనను పంపారన్నారు. తాను ధర్మం కోసం మాత్రమే పని చేస్తానని చెప్పారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావడానికే కష్టపడుతున్ననని తెలిపారు. కరెంటు,ఆర్టీసీ చార్జీలను పెంచాలనే కేసీఆర్ నిర్ణయంపై మండిపడ్డారు.చార్జీల పెంపు ఆలోచన మానుకోవాలని లేకపోతే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒక్కో లీటర్ పెట్రోలు, డీజిల్ పై ట్యాక్స్ రూపంలో కేసీఆర్ సర్కారు 40 రూపాయలు ఖాతాలో వేసుకుంటోందని.. వాటిని తగ్గిస్తే ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన అవసరమే రాదని చెప్పారు. జీడీపీలో తెలంగాణ దేశంలోనే టాప్ అని పదేపదే చెప్తున్న కేసీఆర్‌కు ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్తూ బస్సు చార్జీలు, కరంటు బిల్లులు పెంచుతూ పేదలపై భారం మోపుతున్నారన్నారు.పేదలపై నిజంగా ప్రేముంటే ట్యాక్సులను తగ్గించుకొని చార్జీలు పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు. అమ్మకాల పేరిట ఆర్టీసీ ఆస్తులను దక్కించుకునేందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 10 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు కేంద్రం 2.91 వేల ఇళ్లను మంజూరు చేసిందన్నారు.2023 లో గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తామని స్పష్టంచేశారు. కుటుంబ, అవినీతి, గడీల పాలన అంతం చేసేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Next Story