ప్రధాని టైం ఇచ్చింది కేసీఆర్‌ను చూసి కాదు : ఎంపీ అర్వింద్

by Shyam |
ప్రధాని టైం ఇచ్చింది కేసీఆర్‌ను చూసి కాదు : ఎంపీ అర్వింద్
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : తనకు ప్రధాని మోడీ గంట టైం ఇచ్చిండని సీఎం కేసీఆర్ ఇడా గప్పాలు కోడుతున్నారని, ప్రధాని మోడీ కేసీఆర్‌ను చూసి టైం ఇవ్వలేదని మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలను చూసి ఇచ్చాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్‌లో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఎంపీ అర్వింద్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అడుగడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు కాళేశ్వరం, మిషన్ భగీరథకు మళ్లించబోమని రాతపూర్వకంగా రాసి ఇస్తారా..? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేంద్రం నిధులు చాలా మటుకు దారి మళ్లించారని, అందులో చాలా మేరకు కేసీఆర్ కుటుంబసభ్యుల ఖాతాల్లోకి వెళ్ళాయన్నారు. ఆ చిట్టా ఢిల్లీలో ఉందని, ఇటీవల కొందరికీ ఈడీ పిలుపు అందడం అందులో భాగమే అన్నారు. కేసీఆర్ తెలంగాణలో టెక్స్‌టైల్ పార్క్ కోసం రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని మోడీని కోరారని, కానీ వాటిని కూడా దారి మళ్లించరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని లెదర్ పార్క్‌కు నిధులు ఇస్తే రాష్ర్టం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో రెండు సార్లు ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

రాష్ర్టంలో గ్రామీణ సడక్ యోజనకు నిధుల విడుదల కోరడంపై ఎంపీ అర్వింద్ స్పందిస్తూ.. రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని హైద్రాబాద్ జిల్లా మినహా ప్రతీ జిల్లాకు రూ.50 కోట్లు నిధులు ఇస్తుందన్నారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి రూ. 66-67 కోట్ల లెక్కలలో తొలివిడుత విడుదలైన రూ.17 కోట్లకు సంబంధించిన నిధుల వివరాలు చెప్పకనే, కేంద్రం నుంచి ఇప్పటివరకు రావాల్సిన రూ.950 కోట్ల రూపాయలు నిలిచిపోయాయన్నారు. సర్పంచ్‌లు ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రధానికి విన్నవించడం స్వాగతిస్తున్నామని, జగిత్యాల జిల్లాకు మంజూరైన విద్యాలయానికి సంబంధించి కోరుట్ల- మెట్‌పల్లి మధ్య త్వరగా భూమి కేటాయించాలన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కోసం స్థలాన్ని ప్రధాని కేటాయిస్తారని, పురాతనమైన తెలంగాణ భవన్‌ను వెంటనే హైటెక్ హంగులతో నిర్మించాలని కోరారు. తెలంగాణ రాష్ర్టంలో బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యానారయణ, ప్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డిప్యూటీ ప్లోర్ లీడర్ న్యాలం రాజు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed