కంగనాకు మద్దతుగా కోర్టు తీర్పు.. కింగ్ అంటున్న ఫ్యాన్స్

by Disha News Desk |
కంగనాకు మద్దతుగా కోర్టు తీర్పు.. కింగ్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దేశంలో జరిగే వివిధ సంఘటనలపై నిరంతరం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎన్నోసార్లు నెటిజన్ల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల సిక్కులు, ముంబై పోలీసులపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైకి చెందిన సర్దార్ చరణ్ జిత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె చేస్తున్న వివాదాస్పద పోస్టులను అడ్డుకోవాలంటూ పిటిషన్ వేశాడు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. కంగనా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలను అడ్డుకోలేమని స్పష్టం చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

ఆమె పోస్టులపై కోర్టులను ఆశ్రయించడానికి బదులుగా వాటిని పట్టించుకోవడం మానేయాలని, లేదంటే క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే కంగనా వ్యాఖ్యలపై దాఖలైన ఎఫ్ఐఆర్‏లు అన్నింటినీ పరిశీలనకు తీసుకోవాలని ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‏కు సింగ్ అభ్యర్థించగా.. అలా కోరే అవకాశం కూడా అతడికి లేదని కోర్టు పేర్కొంది. అలా విజ్ఞప్తి చేసే అవకాశం నిందితులకు మాత్రమే ఉంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేయడం విశేషం. కాగా ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్న కంగనా ఫ్యాన్స్ 'కంగనా ఇక నీవు ఎప్పటికీ కింగే' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story