Nindu Noorella Saavasam August 23rd Episode: పెళ్లిచూపుల్లో మనోహరిని కాదన్న అమరేంద్ర.. అరుంధతిపై పగబట్టిన మనోహరి!

by sudharani |   ( Updated:2023-08-23 10:19:18.0  )
Nindu Noorella Saavasam August 23rd Episode: పెళ్లిచూపుల్లో మనోహరిని కాదన్న అమరేంద్ర.. అరుంధతిపై పగబట్టిన మనోహరి!
X

దిశ, సినిమా: పెళ్లిరోజని అమరేంద్ర, అరుంధతి కలిసి గుడికి బయలుదేరతారు. మనోహరి తన ప్లాన్ ప్రకారం రౌడీలకు ఫోన్ చేసి అరుంధతిని మాత్రమే చంపమని చెబుతుంది. గుడికి వెళ్లేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు చంపమంటుంది. గుళ్లోకి వెళ్లిన అరుంధతి పూజారి భాగమతి గురించి చెబుతాడు. భాగి ఆ గుళ్లోనే ఉందని తెలుసుకున్న అరుంధతి సంబరపడిపోతుంది. భాగమతిని వెతుక్కుంటూ గుడి మొత్తం పరుగులు పెడుతుంది. కానీ అంతలోనే అమర్‌కి అర్జెంట్ కాల్ రావడంతో వెంటనే వెళ్లాలని అరుంధతిని తీసుకుని బయలుదేరతాడు. నిరాశగా ఇంటికి బయలుదేరుతుంది అరుంధతి.

చాలాసేపు వేచి చూసిన భాగమతి, ఇక అరుంధతి రాదని అక్కడ నుంచి బయలుదేరుతుంది. భాగిని చూసిన పూజారి అరుంధతి కలిసిందా అని ఆరా తీస్తాడు. లేదని చెప్పడంతో అరుంధతి వచ్చిందని, తనకోసమే వెతికిందని చెప్పి చుట్టుపక్కల చూస్తాడు. అరుంధతి కొండ దిగుతూ కనపడటంతో ఆమె అరుంధతి అంటూ భాగమతికి చూపిస్తాడు పూజారి. తను వచ్చానని తెలిసినా తనను కలవకుండా అరుంధతి ఎందుకు వెళ్లిందో అర్థంకాని భాగమతి వాళ్లని ఫాలో అవుతూ వెళ్తుంది.

ప్లాన్ ప్రకారం రోడ్డుపై మేకులు వేసి అమర్ జీప్ పంచర్ అయ్యేలా చేస్తారు రౌడీలు. రాథోడ్‌కి ఫోన్ చేసి అక్కడకు రమ్మని చెప్పడానికి జీప్ దిగుతాడు అమర్. అదే అదనుగా లారీతో అమర్ జీపుని గుద్దుతారు రౌడీలు. లారీ తమవైపు రావడం గమనించిన అరుంధతి అంజలిని దూరంగా విసురుతుంది. జీపు లోయలో పడిపోవడంతో అరుంధతి చనిపోతుంది. కానీ ఆత్మగా మారిన అరుంధతి అమర్‌ని, అంజలినీ లేపుతూ ఎవరైనా కాపాడండి అని అరుస్తుంది. అమర్ జీప్ వెనకాలే బయలుదేరిన భాగమతి ప్రయాణిస్తున్న కారు ట్రబుల్ ఇవ్వడంతో అక్కడే దిగిపోతుంది. అరుంధతి లోయలో ఎగిరిపడుతుండగా ఆమె మంగళసూత్రం తెగి భాగమతి బ్యాగ్‌లో పడుతుంది. ప్రమాదం జరిగిందని చూసిన చుట్టుపక్కల జనాలు అక్కడికి పరుగున వస్తారు. కానీ వారిని పోలీసులు ఆపేస్తారు. రాథోడ్ అక్కడకు చేరుకుని అమర్, అంజలిని పట్టుకుని ఏడుస్తూ అరుంధతి చనిపోయిందని తెలిసి షాకవుతాడు.

ప్లాన్ సక్సెస్ అయ్యిందని మనోహరికి సమాచారం ఇస్తారు ఆమె అనుచరులు. అరును వివాహం చేసుకోవడానికి అమర్ తనను ఎలా తిరస్కరించాడో గుర్తుచేసుకుంటూ గతంలోకి వెళుతుంది మనోహరి. అనాథాశ్రమంలో పెరిగిన తనను చూసేందుకు వచ్చిన అమర్ తనని కాదని అరుంధతిని ఇష్టపడటం గుర్తు చేసుకుని బాధపడుతుంది. అరుంధతి ఫొటోకి దండవేసి దీపంపెట్టి ఇక అమరేంద్ర తనవాడే అంటూ సంబరపడిపోతుంది మనోహరి. అమరేంద్ర కుటుంబంలో భాగమతి ఎలా భాగమవుతుంది? భార్య చావుని భరించలేక అమర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తెలియాలంటే ఈరోజు, ఆగస్టు 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Read More : Guppedantha Manasu August 23 : ఈ రోజు సీరియల్ చూసాక.. ఇదేందయ్యా.. ఇది అని అనకుండా ఉండరు.. ఎందుకంటే?

Advertisement

Next Story