యవ్వనం పొందేందుకు పక్షవాతం సాయపడొచ్చు : కొత్త పరిశోధన!

by Hamsa |   ( Updated:2022-11-22 08:07:15.0  )
యవ్వనం పొందేందుకు పక్షవాతం సాయపడొచ్చు : కొత్త పరిశోధన!
X

దిశ, ఫీచర్స్ : చేతులు, కాళ్లు వంగిపోవడం, పక్షవాతం సహా అంధత్వానికి కారణమయ్యే వ్యాధి 'లెప్రసీ'. బాడీలో నెమ్మదిగా వృద్ధి చెందే 'మైకోబాక్టీరియం లెప్రే' అనే బ్యాక్టీరియా వల్ల ఇది సంభవిస్తుంది. అయితే, ఈ వ్యాధి శరీరాన్ని సురక్షితంగా రిపేర్ చేయడంతో పాటు పునరుత్పత్తి రహస్యాన్ని కలిగి ఉంటుందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది.

ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు జంతువులపై చేపట్టిన ప్రయోగాల్లో సంబంధిత విషయాలు వెలుగుచూశాయి. కాలేయం పరిమాణాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రేరేపించే అద్భుతమైన సామర్థ్యాన్ని ఈ బ్యాక్టీరియాలో కనుగొన్నారు. ఇది తన సొంత వృద్ధి కోసం మరింత కణజాలాన్ని సమకూర్చుకునే క్రమంలో విప్లవాత్మక చికిత్సలను అందించగలదని తెలుస్తోంది. ఈ బ్యాక్టీరియా సోకిన అర్మడిల్లోస్ వంటి జంతువులపై కుష్టు వ్యాధి ప్రభావాలను పరిశోధకులు పరిశీలించగా.. నేరుగా జంతువుల కాలేయాలకు వెళ్తుందని తేలింది. అంతేకాదు ఒక రకమైన హైజాక్‌ను ప్రదర్శించి, అవయవాన్ని దాని సొంత ప్రయోజనం కోసం రీప్రోగ్రామింగ్ చేస్తుంది.

ఈ మేరకు కాలేయం పరిమాణంలో దాదాపు రెండింతలు పెరిగిందని.. లోపభూయిష్టంగా లేదా అసాధారణంగా కనిపించడానికి బదులు చాలా ఆరోగ్యంగా, క్రియాత్మకంగా ఉందని.. దాని సొంత రక్త నాళాలు, పిత్త వాహికలతో సంపూర్ణంగా ఉందని పరిశోధన వెల్లడించింది. ఇక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కాలేయంలోని అభివృద్ధి గడియారాన్ని(డెవలప్‌మెంటల్ క్లాక్) ఈ బ్యాక్టీరియా రివైండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఆయా జీవుల వయసు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తుండటం విశేషం. అంతేకాదు వారు మరింత పెరగడానికి, పరిపక్వం చెందడానికి ఈ పరిణామం వీలు కల్పిస్తోంది.

ఈ కణం డీఎన్‌ఏకు సంబంధించి వివిధ భాగాల కార్యకలాపాలను చూస్తే, ఇది కాలేయం ఏర్పడుతున్నప్పుడు చిన్న జంతువుల్లో లేదా పిండంలో కూడా ఒక ప్రక్రియను పోలి ఉంటుందని తేలింది. అయితే, అర్మడిల్లోస్ మనలాంటివి కానందున మానవుల్లో దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఇంకా అనేక పరిశోధనలు చేయాల్సి ఉంది. అంతేగాక బాక్టీరియా వ్యాధిని కలిగించేది కాబట్టి, దాన్ని హార్మ్‌లెస్‌గా మార్చేందుకు చాలా శుద్ధీకరణ చేయవలసి ఉంటుంది. కాగా ట్రాన్స్‌ప్లాంట్ కోసం వేచిచూస్తున్న వ్యక్తుల కాలేయం బాగుచేయడానికి లేదా శరీరంలోని ఇతర భాగాలలో వృద్ధాప్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి కూడా ఈ విధానాన్ని అన్వయించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story