భారమైన కథతో ‘భారతీయుడు-2’..

by sudharani |
భారమైన కథతో ‘భారతీయుడు-2’..
X

దిశ, సినిమా: దాదాపు 28 ఏళ్ల క్రితం కమల్‌హాసన్‌, శంకర్‌ కలయికలో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్‌గా.. మళ్లీ అదే కాంబినేషన్‌లో మరింత గ్రాండియర్‌గా రూపొందిన మూవీ 'భారతీయుడు-2'. బిగ్‌బడ్జెట్‌తో, స్టార్‌ వాల్యూస్‌తో తెరెకెక్కిన ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం విడుదలైన ‘భారతీయుడు-2’ అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ తగ్గట్టుగా మెప్పించాడా? లేదా అనేది తెలుసుకుందాం..

కథ: సేనాపతి (కమలహాసన్) సమాజానికి దూరమైన తరువాత మళ్లీ భారతదేశంలో అవినితీ రోజు రోజుకూ పెరిగిపోతుంటుంది. ,ఈ అన్యాయ్యాన్ని, అవినీతి ప్రపంచానికి తెలిపేందుకు 'బార్కింగ్‌ డాగ్స్‌ పేరిట ఓ యూట్యూబ్‌ చానెల్‌ను నడుపుతుంటాడు అరవింద్‌ (సిద్దార్థ్‌) అండ్‌ గ్యాంగ్‌. సోసైటిలో జరుగుతున్న అనాయ్యాలను చూసి మదనపడుతున్న అరవింద్‌ 'కమ్‌బ్యాక్‌ ఇండియన్‌' అనే నినాదాన్ని వైరల్‌ చేసి సేనాపతి (కమల్‌హాసన్‌)ను భారతదేశానికి రప్పిస్తాడు. అయితే ఈ విషయం తెలిసిన సీబీఐ ఆఫీసర్‌ ప్రమోద్‌కుమార్‌ సేనాపతిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే సేనాపతి ఇండియాకు వచ్చి అవినీతిని ఎలా రూపుమాపాడు? ప్రమోద్‌కుమార్‌ సేనాపతిని పట్టుకున్నాడా? లేదా అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: కథపై ఏ మాత్రం పట్టులేకుండా, చాలా హడావుడిగా సన్నివేశాలు రాసుకుని దర్శకుడు శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. 'భారతీయుడు' లాంటి గొప్పకథను వెండితరపై ఎంతో ప్రతిభావంతంగా ఆవిష్కృతం చేసిన దర్శకుడు శంకర్‌ రెండోభాగం పెద్దగా శ్రద్ధ పెట్టినట్లుగా కనిపించలేదు. 'భారతీయుడు' చిత్రంలో మనం చూసేది కల్పిత పాత్ర అయినా ఆ పాత్రతో మనం ట్రావెల్‌ చేస్తాం. నిజంగా ఇలాంటి సేనాపతి మన మధ్యలో వుండే ఎంతో బాగుండు అనిపించే విధంగా ఆ పాత్ర వుంటుంది. అయితే భారతీయుడు-2 చిత్రంలో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇలాంటి ఫీల్‌ ఏమీ కలగదు. సేనాపతి పాత్రతో కాదు కదా.. ఏ పాత్ర ట్రావెల్‌ అవ్వలేం. కథలో ఎటువంటి లాజిక్‌ లేకుండా, ఎమోషన్‌ లేకుండా చాలా సాదా సీద సన్నివేశాలతో చిత్రాన్ని నింపేశాడు దర్శకుడు. కథను చూస్తుంటే అనవసరమైన సన్నివేశాలతో సాగదీసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అవినీతిపరులను చంపుతున్న సన్నివేశాలతో సాగదీసి ఎంతో బోరింగ్‌గా చిత్రీకరించారు. 'భారతీయుడు' సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌లో కలిగే ఉద్వేగం, ఉత్సాహాం ఏమీ ఈ చిత్రంలో మచ్చుకైనా కలిగించదు.

అవినీతిపరుల అంతం చూసి వెళ్లిపోయి ఎన్నో సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన సేనాపతి పునరాగమన సన్నివేశం ఎంతో నిరుత్సాహాంగా, ఊసురుమనిపించే విధంగా చిత్రీకరించారు. ఒకవైపు సేనాపతి హత్యల సన్నివేశాలు ఎంతో పేలవంగా వుండి ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెడుతుంటే.. మరోవైపు సిద్ధార్థ్‌ అండ్‌ గ్యాంగ్‌ వారి తల్లితండ్రులను అవినీతి నిరోదక శాఖకు పట్టించి, వారిని జైలుకు పంపే సీన్స్‌ మరింత నీరసంగా వుంటాయి. ఇక సేనాపతి (భారతీయుడు) మీద ప్రజలు తిరుగుబాటు సన్నివేశాలు చూస్తుంటే.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు దర్శకుడు శంకర్‌ మీద చేస్తున్న తిరుగుబాటులా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఎంతో పేలవంగా నడుస్తున్నాయి అనుకున్న తరుణంలో.. భారతీయుడు-3 గురించి ఇంట్రడక్షన్‌ ఇచ్చి.. భారతీయుడు-3కు సిద్ధం కండి అంటూ ఆ ట్రైలర్‌ను వదలటం.. ప్రేక్షకులను మరింత నిరాశకు గురి చేస్తుంది. భారతీయుడు-2లో ఇంత విసిగించి ఇక భారతీయుడు-3 కోసం రండి అనడం నీకు భావ్యమా అనే ఫీలింగ్‌లో థియేటర్‌ నుండి ప్రేక్షకులు మెల్లగా కదిలారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ తన పరిథి మేరకు ఒదిగిపోయాడు. సన్నివేశాల్లో బలం లేకపోయినా కేవలం కొన్ని సన్నివేశాల్లో ఆయన నటనతో ఆ సీన్స్‌ మరింత బాగా కనిపించాయి. ఏది ఏమైనా కథ, కథనాల్లో శక్తి లేనప్పుడు ఆర్టిస్టులు తమ శక్తి వంచన లేకుండా నటించానా పెద్ద ఫలితం వుండదు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి ఓ గొప్ప సీక్వెల్‌ను తీస్తున్నప్పుడు అంచనాలు తగిన సన్నివేశాలు, సంభాషణలు వుంటాయని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సిద్డార్థ్‌, రకుల్‌ నటన ఫర్వాలేదు. ఇక సంగీతం, నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అనిరుధ్‌ అందించిన అత్యంత పేలవమైన సంగీతం ఇది. కెమెరా పనితనం బాగుంది.

ఇక లైకా ప్రొడక్షన్‌ మేకింగ్‌ మాత్రం చాలా రిచ్‌గా వుంది. అత్యంత పేలవమైన సన్నివేశాలు వుండటం వల్ల ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నా ఉపయోగం లేదు. కథ, కథనాలు తెరకెక్కించడంలో బ్రిలియంట్‌ రైటర్‌గా పేరున్న శంకర్‌ ఎందుకో ఈ చిత్రంలో తన ప్రతిభను చూపలేకపోయాడు. ఒకేసారి ఒకవైపు గేమ్‌ఛేంజర్‌, మరో వైపు భారతీయడు-2 చిత్రాల చిత్రీకరణ చేసిన శంకర్‌ కన్‌ఫ్యూజ్‌ అయ్యాడా లేక ఫోకస్‌ పెట్టాలేకపోయాడా అనే అనుమానం రాక మానదు. గతంలో శంకర్‌ సినిమాల్లో ఫెయిల్యూర్స్‌ వున్న అవి కమర్షియల్‌గా నిరాశపరిచినా, ఆ చిత్ర కాన్సెప్టులు కానీ, కథలు కానీ శంకర్‌కు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అయితే భారతీయుడు-2 మాత్రం శంకర్‌ కెరీర్‌లో పూర్తి డిజాప్పాయింట్‌ ఫిల్మ్‌గా వుంటుంది.

ఫైనల్‌గా : భారమైన కథతో నిరాశపరిచిన భారతీయుడు-2

Advertisement

Next Story

Most Viewed