లిటిల్‌ పాలస్తీన్‌ (డైరీ ఆఫ్‌ ఏ సీజ్‌) (2011)

by M.Rajitha |
లిటిల్‌ పాలస్తీన్‌ (డైరీ ఆఫ్‌ ఏ సీజ్‌) (2011)
X

7 వ ఫ్రేమ్స్‌ ఆఫ్‌ ఫ్రీడం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సినిమా సమీక్షలు


2. లిటిల్‌ పాలస్తీన్‌ (డైరీ ఆఫ్‌ ఏ సీజ్‌) (2011) (దర్శకుడు: అబ్దుల్లా అల్‌ ఖతీబ్‌)

1948 నక్బా తర్వాత పాలస్తీనా ప్రజలు చుట్టు ప్రక్కల చాలా దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో కొంత మంది సిరియాక్కూడా చేరారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని యార్మౌక్‌ అనే 520 ఎకరాల భూభాగంలో పాలస్తీనా శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు. ఈ శిబిరం 1957 నుండి 2018 వరకు ప్రపంచంలోనే అతి పెద్ద పాలస్తీనా శరణార్థుల నిలయంగా కొనసాగింది. 2002 నాటికి 112, 500 మంది శరణార్థులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కిక్కిరిసిన ప్రదేశమే అయినా ఆసుపత్రులూ, పిల్లల కోసం బడులతో కలిపి ఇదో ‘బుల్లి పాలస్తీనా’లా కనిపిస్తుంది. మొదట్లో సిరియన్లు పాలస్తీనా వారిని అక్కున చేర్చుకున్నారు. కానీ సిరియన్‌ తిరుగుబాటు తర్వాత పరిస్థితి క్రమంగా దిగజారుతూ చివరకు భయానకంగా మారింది. తిరుగుబాటుదారులకు ఆశ్రయంగా ఉందన్న కారణంతో 2013 నుండి 2015 వరకు అధ్యక్షుడు అస్సాద్‌ ఈ శిబిరాన్ని నలువైపుల నుండీ ముట్టడి చేశాడు. ఎవరూ బయటికి వెళ్లకూడదు. బయటి నుండి ఎవరూ లోనికి రాకూడదు. ఆహారం, నీరూ, మందులూ, విద్యుత్తూ వంటి కనీస అవసరాలు ముట్టడిలో ఉన్న ప్రాంతానికి అందకుండా కట్టడి చేశారు. ఒక వైపు బ్యారెల్‌ బాంబింబ్‌ సాగుతూనే వుంది. భవనాలు శిథిలాలుగా మారుతూనే వున్నాయి. బాంబుల చావులతో పాటు ఇక ఆకలి చావులు మొదలయ్యాయి. తిండిలేక చనిపోతున్నారు. మందులు లేక చనిపోతున్నారు. ఈ ముట్టడిని 2011 నుండి 2015 వరకు ఐదేళ్ల పాటు చిత్రీకరిస్తూ తయారుచేసిన చారిత్రక దస్తావేజు ‘లిటిల్‌ పాలస్తీన్‌ (డైరీ ఆఫ్‌ ఏ సీజ్‌)’ డాక్యుమెంటరీ.

ఈ సినిమా దర్శకుడు అబ్దల్లా అల్‌ ఖతీబ్‌ ఈ శిబిరంలోనే 1989లో జన్మించాడు. తనూ, తన స్నేహితుడు హసన్‌ హసన్‌ కలిసి కంటి ముందు కదలాడుతున్న కన్నీటి చరిత్రను రికార్డు చేశారు. నిజానికి హసన్‌ హసన్‌ కొద్ది రోజుల షూటింగు తర్వాత తన కెమేరా బాధ్యతను అల్‌ ఖతీబ్‌కు అందించాడు. (ఆ తర్వాత ఆయనను చంపేశారు.) అల్‌ ఖతీబ్‌ అక్కడి వాడే కనుక పిల్లలతో సహా అందరూ హాయిగా ఇంటర్వ్యూకి సిద్ధమయ్యారు. దర్శకుడు, అతని తల్లి ఇద్దరూ ఐక్యరాజ్య సమితి (UNRWA – United Nations Relief Works Agency) వాలంటీర్లు. దర్శకుడి తల్లి ఉమ్‌ మహ్మూద్‌ ఒక నర్సు. ఆమె తన రోగుల్ని (ముఖ్యంగా వృద్ధ మహిళలూ, చిన్నపిల్లల్ని) చూట్టనికి వెళ్లినపుడు కెమేరా ఆమె వెంటే వెళుతుంది. ముట్టడి సాగినన్నాళ్లూ కెమెరా ఆ గుంపులోని ఒక జీవిగా మారిపోతుంది. రాత్రి పూట జనరేటర్‌ సహాయంతో తన కెమేరానూ, ల్యాప్‌టాప్‌లనూ చార్జి పెట్టుకుని రోజంతా చాలా ఓపికతో షూటింగు చేసేవాడు దర్శకుడు. ముట్టడి లేక Siege నేర్పిన పాఠాలు అంటూ నేపథ్యంలో దర్శకుడి కవితాత్మక స్వరం ఈ సినిమాను మరింత భావోద్వేగంతో ప్రేక్షకుల్ని కవితా విలాపంలో తడిపేస్తుంది.

‘‘ఇక్కడ జీవితానికీ మరణానికీ ప్రత్యక్ష సంపర్కముంది

జీవితాన్ని నువ్వెంత ప్రేమిస్తే, చావు నిన్నంతగా ప్రేమిస్తుంది.

చావును నువ్వు ప్రేమించగలిగితే, జీవితం నిన్ను ప్రేమిస్తుంది.

చావుతో జాగ్రత్తగా మసలుకోగలిగితేనే జీవితం నీకు దక్కుతుంది.

నేనిప్పుడు ఆ జాగ్రత్తలోనే ఉన్నాను.’’

ముట్టడి నేర్పిన పాఠాల్లో మచ్చుకు ఒకటి. దర్శకుడు తన స్వానుభవం మీద ఇలాంటి 40 పద్యరూప పాఠాలు రాసుకున్నాడు. వాటిలోంచి కొన్ని సినిమా పొడుగునా వినిపిస్తుంటాడు.

ఒకప్పుడు మనుషుల రాకపోకలతో సజీవంగా కళకళలాడుతూండిన వీధులు - దిగంతాలకు విస్తరిస్తూ, ఎన్నో సంభావ్యతలకు తావిస్తూ! కొద్దిరోజుల్లో కథ మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. శిథిలాల కుప్పలతో రోడ్డును మూసేశారు. అవతలి దృశ్యం కూడా కనిపించకూడదని అడ్డు తెర కట్టారు. మరి ఇవతలి జనాలు ఏం కావాలీ? ఎలా బ్రతకాలీ? ఎవరికీ పట్టింపు లేదు. ఆ స్థితిలో శరణార్థులు ఈ ముట్టడిని ఎలా ఎదుర్కొన్నారు? చావుయాత్రల మధ్యలో కూడా వారి జీవన రహస్యమేమిటి? - ఈ ప్రశ్నల సమాధానమే ఈ సినిమా!

ముట్టడి ఎన్నాళ్లు కొనసాగుతుందో, ఎటువంటి భయంకర పరిణామాలకు దారితీస్తుందో ఎవరికీ తట్టలేదు. మొదట్లో ఆటలాడుకుంటున్న పిల్లల్ని దర్శకుడు ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ‘మీకొచ్చిన కల ఏంటి?’ అని అడిగినపుడు - ‘చికెన్‌ తింటున్నట్టు కల వచ్చిందనీ’, ‘చనిపోయిన మా అన్నయ్య తిరిగొచ్చినట్టు కల వచ్చిందనీ’ కేర్‌ఫ్రీగా చెబుతుంటారు ఆ పిల్లలు. ఏదోకటి, ఎంతో కొంత ‘దాణా’ అందుతున్న కాలమది. సినిమా ఆఖరౌతుందనగా దర్శకుడు తస్నిమ్‌ అనే అమ్మాయిని ఇంటర్వూ చేస్తాడు. ఆమె చిన్న చిన్న గడ్డి మొక్కల్ని తిండి కోసం సేకరిస్తూ కనిపిస్తుంది. ఆ మొక్కలు మరీ పెద్దవైతే విషంగా మారే ప్రమాదముంది. లేలేతవైతేనే తినడానికి పనికొస్తాయి. అటువంటి మొక్కల సేకరణలో ఆ ఇంటి పిల్లలందరూ తలమునకలై ఉన్నారని చెబుతుందామె. ‘తనకు చావంటే భయం లేద’ని ఆ చిన్నమ్మాయి అంటునప్పుడే ప్రక్కనే ఒక భవనంపై బాంబు పడుతుంది. ‘నేను రొట్టెముక్కల్ని చాలా మిస్సవుతున్నాను.’ అని తన చిన్న కోర్కెనువినిపిస్తుందామె. ‘చికెన్‌, హల్వా, పిజ్జా, జామ్‌, బ్రెడ్‌’ ఇలా గుర్తొచ్చిన తినుబండారాల పేర్లన్నీ చెబుతుంది. పాల కోసం తన బుల్లి తమ్ముడు రోజంతా అల్లరి చేస్తుంటాడని చెబుతుందామె.

క్యాక్టస్‌ మొక్కలతో ‘సూప్‌’ చేసుకోవచ్చని సలహా ఇస్తుంటాడు మరో యువకుడు. నాకు కోపం వస్తే కుక్కను చంపేసి బార్బిక్యూ చేసి తినేస్తానని కసిగా చెబుతాడతడు. వాలెంటీర్లు పెద్ద పెద్ద కుండల్లో నీళ్లు మరిగించి దానిలో కొంచెం పాల పౌడరు, కొంచెం మసాలా పౌడర్లు వేసి చేసిన సూప్‌ కోసం పాలిథన్‌ క్యారీ బ్యాగుల్తో క్యూ కట్టే దృశ్యం గుండెను మెలిపెట్టేస్తుంది. రెడ్‌ క్రాస్‌ నుండి ఆహారధాన్యాల సేకరణకై ప్రయత్నించి విఫలమౌతారు దర్శకుడూ, అతడి మిత్రులూ. ఓ దశలో శరణార్థులకు తెగింపు పస్తుంది. చావో, పిడికెడు గింజలో తేల్చుకుందామని చెక్‌పోస్టు వైపు తరలివెళ్తారు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు సాగుతారు. కానీ చివరికి బుల్లెట్లూ, చావులే దక్కుతాయి. ప్రాణభయంతో వెనక్కి పరుగెత్తక తప్పదు.

‘‘ముట్టడి నిన్ను పిచ్చెక్కించేస్తుంది. నిన్ను ఆత్మహత్యకు పురికొల్పుతుంది. నువ్వు బ్రతికుండడానికి గల కారణాలను వెతుక్కోవాలి.’’

‘‘ముట్టడి మన అనుదిన సహచరి అయిపోయింతర్వాత దాన్నించి తప్పించుకోవడం కాదు, దాన్ని వెంటేసుకుని బ్రతకడం నేర్చుకోవాలి. దాన్ని ఓడించే వ్యాపకాలు వెదుక్కోవాలి. రోడ్లు చాలా పరిశుభ్రం చేసుకోవడం కూడా ఒక వ్యాపకం కావచ్చు. సమయమూ, శక్తీ ఉన్నప్పుడు అందరూ కలిసి పాటలు పాడుకోవచ్చు.’’

శిథల భవనం నుంచి పియానోను రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చి ఆర్కెస్ట్రా పాడుకునే దృశ్యం చాలా ఉత్తేజభరితంగా కనిపిస్తుంది. ‘మాకు కావల్సింది ఆహార పాకెట్లు కాదు. కష్టపడి బ్రతగ్గల పరిస్థితి.’ అని ‘యూఎన్‌ ఎయిడ్‌’ (ఐక్యరాజ్య సమితి ఆహార పొట్లాల వితరణ) గురించి ఓ మహిళ అన్న మాట చావు ఎదుట కూడా ఆవిడ ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తుంది.

‘‘మీరు రహదారిని భస్మం చేస్తే, మేము ఆ దారికిరువైపులా మొక్కల్ని నాటుతాము. మీరు మా పిల్లల్ని చంపేస్తే, మా దగ్గర జన్మనిచ్చే తల్లులు మరింత మంది ముందుకొస్తారు.’’

‘నేను ముట్టడి మోసుకొచ్చే మానసిక, సామాజిక ప్రభావాన్ని డాక్యుమెంట్‌ చేయాలనుకున్నాను’ అని చెబుతాడు దర్శకుడు ఒక ఇంటర్యూలో.

‘‘ముట్టడి మెజారిటీ జనాల్లోని మానవత్వాన్ని దారుణంగా హతమారుస్తుంది.

మిగిలిన కొద్దిపాటి మైనారిటీ జనుల్ని ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దుతుంది.

మీరు ఆ మైనారిటీలో ఒకరిగా ఉండేలా చూసుకోండి,

తద్వారా శాశ్వతంగా మిమ్మల్ని మీరు సొంతం చేసుకున్నవారౌతారు.’’

- అంటూ ముట్టడి నేర్పిన నాలుగో పాఠంగా రాసుకున్నాడు దర్శకుడు.

‘‘చనిపోయినవారిని గుర్తుంచుకోకపోతే, వారి గురించి మాట్లాడుకోకపోతే, వారు రెండోసారి చనిపోతారు నాయనా’ అని మా బామ్మ చెబుతుండేది. యుద్ధంలో, ముట్టడి సమయంలో కోల్పోయిన స్నేహితులు మళ్లీ చనిపోకుండా ఉండేందుకు నేనీ సినిమా తీశాను.’’ అని చెబుతాడు దర్శకుడు మరో ఇంటర్వ్యూలో.

యార్మౌక్‌ శిబిరం ముట్టడి కారణంగా 181 మంది శరణార్థులు ఆకలితో మరణించారు. దర్శకుడు వారందరి పేర్లనూ తెరపై చూపిస్తాడు. 2015లో ఈ క్యాంపును ‘ఐసిస్‌’ వారు ఆక్రమించారు. శరణార్థుల్ని తరిమేశారు. 2018లో రష్యా సహాయంతో ‘ఐసిస్‌’ వారిపై బాంబులు వేయగా వారంతా సిరియా ఎడారుల వైపు పారిపోయారు. కానీ అస్సాద్ ప్రభుత్వం శరణార్థులను మళ్ళీ ఈ శిబిరానికి రానివ్వలేదు. ప్రాణాలతో మిగిలిన శరణార్థులందరూ ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురయ్యారు. దర్శకుడూ, అతడి తల్లీ ఇప్పుడు జర్మనీలో ఉంటున్నారు. అక్కడే ఈ సినిమాను ఎడిట్‌ చేశారు. కొన్ని వందల గంటల ఫుటేజి నుండి ఎడిట్‌ చేసిన సిరియా ఎడిటర్‌ కుతైబా బర్హమ్జీ పనితనాన్ని ప్రత్యేకించి ప్రశంసించాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మన్ననలు పొందింది.

నిఘా, మిలటరీకరణాల గురించి ఎలియా సులేమానీ నిర్మించిన ట్రాజికామెడీ ‘ఇట్‌ మస్ట్‌ బి హెవెన్‌’, ఉత్తర సిరియా రొజావా ప్రాంతంలో ఐసిస్‌, ఇతర మిలిటెంట్లతో పోరాటం చేస్తున్న సంపూర్ణ మహిళల సైనిక దళం గురించిన ‘డ్రీమ్స్‌ గేట్‌’ (దర్శకురాలు నెగిన్‌ అహ్మదీ), చెత్త కుప్పల మధ్య బ్రతుకీడ్చే జంటకు సంబంధించిన హృద్యమైన కథ ‘జంక్స్‌ అండ్‌ డోల్స్‌’ (మనిజే హెక్మత్‌ కథా చిత్రం), తమ ఇంటి కథ ఆధారంగా మూడు తరాల కాలంలో తెహ్రాన్‌లో వచ్చిన మార్పుల్ని చిత్రించిన ‘సైలెంట్‌ హౌస్‌’ (దర్శకులు: ఫర్నాజ్‌ జురాబ్చియన్‌, మొహమ్మద్రెజా జురాబ్చియన్‌) సినిమాలను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శించారు.

- ఎమ్ బాలాజీ (కోల్‌కతా)

మంచి సినిమా నిర్వాహకులు

90077 55403


Advertisement

Next Story