100 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేసిన మంచులక్ష్మి

by Shyam |   ( Updated:2021-02-28 10:03:19.0  )
Manchu Lakshmi
X

దిశ, కంటోన్మెంట్: తొలిసారి 100 కిలో మీటర్లు సైకిల్ రైడ్ చేసి కల నెరవేర్చుకున్నానని ప్రముఖ నటి, నిర్మాత లక్ష్మిమంచు అన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఎఎమ్ఎఫ్)కు చెందిన పారా అథ్లెట్ల కోసం నిధులు సేకరించేందుకు సైకిల్ రైడ్ చేపట్టారు. హైదరాబాద్‌లోని రసూల్ పూరలో ఉన్న ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ, రీహాబిలిటేషన్ సెంటర్ వద్ద ఆదివారం ఉదయం 5.00 గంటలకు ఈ రైడ్‌ను తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న మంచు అక్కడి నుంచి తూప్రాన్ వరకు వెళ్లి తిరిగి 11.30కు అకాడమీకి చేరుకొని 100 కిలో మీటర్లు సైకిల్ రైడ్ పూర్తి చేశారు. ఏఎమ్ఎఫ్ వద్ద పారా-అథ్లెట్ల నుంచి ఆమె చిరస్మరణీయమైన స్వాగతం అందుకున్నారు. ఆమె తోపాటు రైడ్‌లో ఇండియన్ పారా సైక్లింగ్ బృందంతో పాటు మరికొందరు సైక్లిస్టులు కూడా పాలుపంచుకున్నారు.

actress Manchu Lakshmi

కఠోర శ్రమతో..

యూసీఐ (యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్) సర్టిఫైడ్ సైక్లింగ్ కోచ్ అయిన ఆదిత్య మెహతా మార్గదర్శకత్వంలో కఠినమైన శిక్షణ పొంది, 100 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేయాలనే కలను సాకారం చేసుకున్నారు మంచు లక్ష్మి. నెల రోజులుగా ప్రతిరోజూ తెల్లవారుజామున 5.00 గంటలకు ఆమె విరామం లేకుండా 30 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేస్తూ కఠినమైన శిక్షణను తీసుకుని తద్వారా సమతులంగా, వాలుగా మరియు ఎత్తైన కొండ ప్రాంతాల్లో సవారీ చేసేందుకు అవసరమైన వేగాన్ని, బలాన్ని ఆమె సమకూర్చుకున్నారు. లక్ష్మి సున్నితమైన మనస్తత్వం కలవారే కాకుండా దివ్యాంగులైన అథ్లెట్ల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆమె పారా-క్రీడాకారుల శ్రేయస్సు కోసం , వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. ‘ఈ యాత్ర ద్వారా రూ.5 లక్షలను సమకూర్చాలని నిశ్చయించుకున్నామని, మంచు చొరవ ద్వారా ఇప్పటికే రూ. 7 లక్షలు వరకు నిధులు వసూలయ్యాయని, ఇంకా సమకూరుతున్నట్లు ఆదిత్య మెహతా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed