- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ సైనికుడి తిరుగుబాటు
దిశ, తెలంగాణ బ్యూరో : ఈటెల మాటలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. ఎందుకంటే రాష్ట్రంలోని తిరుగులేని చరిత్రను రాసుకున్న సీఎం కేసీఆర్‌పై… పార్టీలో ఉంటూనే విమర్శలు చేసిన ఘనత కేవలం ఈటల రాజేందర్‌ది మాత్రమే. ఓ వైపు సీఎం కేసీఆర్‌ను వెనకేసుకొస్తూనే… పార్టీపై అగ్గి మండారు. కేసీఆరే మా నాయకుడు, తానెప్పటికీ గులాబీ సైనికుడినేనన్న ఈటెల… ఎప్పుడైనా పార్టీ అధిష్టానంపై పల్లెత్తు మాటా అనలేదు. కానీ హైకమాండ్‌కు చాలా దగ్గరగా ఉండే ఓ నేతపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.
కావాలనే తన గురించి కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు రాతలు రాయిస్తున్నారని, అందుకే తన బాధనంతా వెళ్లగక్కారంటూ ఈటల వ్యాఖ్యలపై విశ్లేసిస్తున్నారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదు.. బీసీ కోటాలో మంత్రి పదవి అడగలేదంటూ చెప్పుకొచ్చిన మంత్రి… న్యాయం, ధర్మం నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని ఘాటైన కామెంట్లు చేశారు. అంతేకాదు, త్వరలో హీరోలెవరో, జీరోలు ఎవరో తేలుతుందని, భవిష్యత్తులో తాను చెప్పబోయే విషయాలు, ఎలాంటి మంటలు రాజేస్తాయో చెప్పకనే చెప్పారు.
మరోవైపు పార్టీలో కొందరి కుట్ర కారణంగా మంత్రి పదవి ఇవ్వకుండా సతాయించారని, బీసీ సమీకరణాల్లో భాగంగానే చోటు కల్పించాల్సి వచ్చిందని పార్టీ నేతలే ప్రచారం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో, టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఓడిపోవడం, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలువడం కూడా ఈటలపై అనుమానాలు పెంచింది. ఈ ఓటమికి ఈటెల సమన్వయ లోపమే కారణమని, కొందరు టీఆర్ఎస్ నేతలే హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు టాక్.
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల కోసం, నియోజకవర్గాల సమన్వయకర్తగా వ్యవహరించిన ఈటలకు… కొందరు ఎమ్మెల్యేలే సహకరించలేదంటూ ఆయన కూడా అధిష్టానానికి నివేదిక ఇచ్చుకున్నట్లు గతంలో ప్రచారం. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో వినోద్‌కు ఎక్కువ మోజార్టీ ఈటెల నియోజక వర్గంలోనే వచ్చినా.. వినోద్ ఓటమికి ఈటలనే బాధ్యున్ని చేశారన్న చర్చ పార్టీ నేతల్లో జరిగింది. అది తనను బాధించిందంటూ ఈటల కొంతమంది దగ్గర మధనపడ్డారు కూడా. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి పదవి కోటా కింద రెండోసారి కూడా ఈటెలకే దక్కడాన్ని, పార్టీలోనే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఈటెలను తప్పించి, తమకు ఇవ్వాల్సిందిగా, అధిష్టానంపై చాలా మంది ఒత్తిడి తెచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయమే.
ఇలా పలు అంశాల్లో తనను పక్కన పెట్టడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మంత్రి ఈటల అసంతృప్తిలో భాగమేనంటున్నారు. గత ఏడాది కలెక్టర్లతో జరిగిన సీఎం సమావేశంలో రెవెన్యూ చట్టాలకు తీసుకురాబోతున్న సంస్కరణల గురించి బయటకు లీక్ చేశారన్న ప్రచారం ఓ పత్రికలో అటు సోషల్ మీడియాలో జరిగింది. తనను కలవడానికి ఇంటికి వచ్చిన రెవెన్యూ సంఘాల నేతలతో ఈటల మాట్లాడారని, కలెక్టర్ల సమావేశంలో జరిగిన విషయాలన్నీ చెప్పారని, అందుకే రెవెన్యూ ఉద్యోగులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ, ప్రభుత్వ చర్యలపై నిరసన వ్యక్తం చేశారనే అపవాదు ఉంది. ఈ వ్యవహారంలో ఈటలపై అధిష్టానం సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది.
ఈ విషయంలో టీఆర్ఎస్లోని ఒక వర్గం తనను బద్నాం చేస్తుందంటూ ఈటల సన్నిహితుల దగ్గర వాపోయినట్లు కూడా సమాచారం. అంతేకాకుండా గతంలో ఓసారి ఢిల్లీకి వెళ్లినప్పుడు బీజేపీ అధిష్టానాన్ని కలిశారనే ప్రచారాన్ని కూడా టీఆర్ఎస్ వర్గాలు చేశాయి. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో ఈటలను అధిష్టానం టార్గెట్ చేసిందని, ఈ నేపథ్యంలోనే పలుమార్లు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని చర్చ జరిగింది.
అటు గులాబీ పార్టీ అధిష్టానంలో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడితో ముందు నుంచీ ఈటలకు పడటం లేదని, అందుకే ఈటలపై ఇలాంటి ప్రచారాన్ని పార్టీ నేతల నుంచే తీసుకువస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే ఉద్యమ కాలం నుంచి సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ మంత్రి పార్టీ అధిష్టానానికి దూరంగా ఉన్నాడని, ఆయనతో ఈటల సన్నిహితంగా ఉండటం అధిష్టానం పెద్దలకు ఇట్టం లేదని తెలుస్తోంది. దాంతో మంత్రివర్గం నుంచి ఈటలను కూడా తప్పించడం ఖాయమని, దీన్ని గులాబీ బాస్ పలుమార్లు పార్టీ నేతలతోనే చెప్పారంటూ టాక్ నడిచింది. అందుకే ఈటల పరోక్షంగా ధిక్కార స్వరం వినిపించారంటున్నారు.
ఇక మంత్రి ఈటల ఇటీవల హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్‌లో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు. టీఆర్‌ఎస్ నేతలను సైతం గృహ ప్రవేశానికి పిలిచి భారీ విందు ఇచ్చారు. ఈ విశాలమైన ఇల్లు, ఇంపోర్టెడ్ ఇంటీరియర్, ఫర్నీచర్ చూసి కొంతమంది నేతలు తట్టుకోలేకపోయారని ప్రచారం జరిగింది. ఇంతటి విలాసవంతమైన ఇల్లు కట్టుకోవడంపై కొందరు నేతలు ఈర్శ్య పడ్డారంటూ ఈటల పలుమార్లు ప్రసంగంలోనే వెళ్లగక్కారు. తనకు ఎప్పటి నుంచో వ్యాపారాలున్నాయని, ఆ డబ్బుతోనే లగ్జరీగా ఇల్లు కట్టుకున్నాని, ఇది కొందరు నేతలకు కళ్లు కుట్టేలా చేసిందంటూ ఫైరయ్యారు.
ఇలా పలుమార్లు మంత్రి ఈటల స్వరం పెంచినా… మళ్లీ తగ్గించుకుంటూ వస్తున్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, తన ప్రసంగంలో రంధ్రాన్వేషణ చేశారని అలాంటి పోకడ మంచిదికాదంటూ చెప్పుకొచ్చారు. తానెప్పుడూ గులాబీ సైనికుడేనని చెప్పుకుంటూ ఒక్కసారిగా రేగిన మంటలను చల్లార్చే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.