ఫ్యూజీ అగ్నిపర్వతం సిమ్యులేషన్… టోక్యోకి పెద్ద ప్రమాదం

by Shyam |   ( Updated:2020-04-03 02:09:50.0  )
ఫ్యూజీ అగ్నిపర్వతం సిమ్యులేషన్… టోక్యోకి పెద్ద ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్:
జపాన్‌లోని ఫ్యూజీ అగ్నిపర్వతం బద్ధలైతే జరగబోయే పరిణామాల గురించి ఆ దేశ ప్రభుత్వం ఒక సిమ్యులేషన్ విడుదలచేసింది. దాదాపు 92 అగ్నిదారుల వద్ద పర్వతం బద్దలైతే కలిగే నష్టాల గురించి భిన్న మోడళ్లు సృష్టించి ఈ సిమ్యులేషన్ని సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ రూపొందించింది. లావా ద్వారా టోక్యోకి పెద్దగా ప్రమాదం లేకపోయినా పర్వతం నుంచి విడుదలయ్యే బూడిద వల్ల ఆ నగరం తీవ్రనష్టాన్ని ఎదుర్కోబోతోందని సిమ్యులేషన్‌లో తేలింది. దరిదాపుగా 17.3 బిలియన్ క్యూబిక్ ఫీట్ల అగ్నిపర్వత బూడిద టోక్యోను ముంచేస్తుందని సిమ్యులేషన్ ద్వారా విదితమైంది.

2011 టోహోకు భూకంపం, సునామీ కారణంగా గుమిగూడిన చెత్తతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా నిజంగా అగ్నిపర్వతం పేలితే జరిగే పరిణామాలకు సంబంధించి నిమిషాల అప్‌డేట్ కూడా ఈ సిమ్యులేషన్ సృష్టించింది. అగ్నిపర్వతం బద్దలవగానే మూడు గంటల పాటు కొద్దికొద్దిగా బూడిద పడి, ఆ తర్వాత 24 గంటల్లో టోక్యో బూడిదలో మునిగిపోతుంది. రోడ్ల మీద కేవలం ఒక ఇంచులో బూడిద పడితే వాహనాల కదలికకు అసౌకర్యం కలుగుతుంది. అంతేకాకుండా రైలు, విమానాలకు ఇబ్బంది కలిగి నగరాన్ని ఖాళీ చేసే అవకాశం లేక టోక్యో వాసులందరూ సజీవంగా బూడిదలో కలిసిపోయే ప్రమాదముందని సిమ్యులేషన్ చెబుతోంది.

గత 5600 ఏళ్లలో ఫ్యూజీ అగ్నిపర్వతం 180 సార్లు బద్దలైంది. కానీ వీటి ప్రభావం దగ్గర ప్రాంతాలకే పరిమితమైంది కానీ టోక్యో వరకు రాలేదు. చివరిసారిగా 1707లో ఈ అగ్నిపర్వతం బద్దలైనపుడు 28.2 బిలియన్ క్యూబిక్ అడుగుల బూడిద విడుదలై, దాదాపు రెండు వారాల పాటు వర్షంలాగ పడిందని జపాన్ డిజాస్టర్ కౌన్సిల్ రికార్డుల్లో ఉంది. అలాగే తాము తయారుచేసిన ఇలాంటి సిమ్యులేషన్ల వల్ల జరగబోయే ప్రమాదాలు, అనర్థాల గురించి స్థానిక ప్రభుత్వాలను అప్రమత్తం చేసే వీలు కలుగుతుందని డిజాస్టర్ కౌన్సిల్ వెల్లడించింది.

Tags: Japan, Fuji Mount, Volcano, Simulation, Tokyo

Advertisement

Next Story

Most Viewed