ఆ ఇంటి దీపాలను ఆర్పిన ‘దీపావళి’.. కొడుకు ఇకరాడని తెలిసి తల్లి కూడా!

by Sumithra |
ఆ ఇంటి దీపాలను ఆర్పిన ‘దీపావళి’.. కొడుకు ఇకరాడని తెలిసి తల్లి కూడా!
X

దిశ, హైదరాబాద్ : పండగ పూట పిల్లలతో ఆనందంగా గడపాలనుకున్న ఆ తల్లి ఆశ ఆవిరైంది. పండుగకు కన్నబిడ్డను కళ్లారా చూసుకోవాలన్న ఆశ నిరాశగానే మిగిలింది. తనకు దూరంగా ఉన్న కొడుకు, కోడలు దీపావళి పండుగకు వస్తారని ఆ తల్లి మనసు సంతోషంతో ఎదురుచూసింది. కొద్ది గంటల్లోనే తిరిగి రాని లోకానికి వెళ్లాడని తెలిసి తల్లి గుండె శోకసంద్రం అయింది. ఆ బాధను ఎక్కువ రోజులు దిగమింగలేక తనలో తాను కుమిలిపోయి ఇక ఈ జీవితానికి ముగింపు పలకాలని నిశ్చయించుకుంది. తెల్లవారేసరికి విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మోడల్ కాలనీకి చెందిన బుచ్చిబాబు, సుజాత(53) దంపతులకు ఒక కొడుకు. పేరు యోగ. అతనికి గత ఆగస్టులో వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్లు ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

ఉద్యోగ రీత్యా కొడుకు, కోడలు ఏపీలోని విశాఖపట్నంలో ఉంటున్నారు. దీపావళి పండుగకు ఇంటికి రావాలని తల్లి సుజాత కొడుకు, కోడలిని కోరింది. వారికి సెలవు దొరక్కపోవడంతో పండుగకు రాలేకపోయారు. కొడుకు, కోడలిని కళ్లారా చూసుకుందామని ఆశపడిన ఆ తల్లికి నిరాశే ఎదురైంది. ఉరుకుల పరుగుల జీవితం.. బిజీ షెడ్యూల్‌తో బిడ్డకు కన్నవారిని పలకరించే తీరిక కూడా లేదని తెలిసి కుంగిపోయింది. దీపావళి రోజు తన కంటి దీపాన్ని చూసుకోవాలని ఆతృతగా ఎదరుచూసిన ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసింది. తను ప్రేమగా చూసుకునే కొడుకు ఇక లేడని తెలియడంతో ఆ తల్లి కంట కన్నీటి వరద పారింది.

కొడుకు దూరమైన ఎడబాటుతో ఆ తల్లి ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయింది. తన కొడుకు జ్ఞాపకాలను మర్చిపోలేక సుజాత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భర్త పెంట్‌హౌస్‌లో నిద్రిస్తుండగా కింది అంతస్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో రెండు విషాదాలు చోటుచేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. భార్య మృతిపై భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed