అమ్మా మా నాన్నెవరు !.. కోపంతో వాతలు పెట్టిన తల్లి

దిశ, వెబ్‌డెస్క్: అమ్మా మా నాన్నెవరు ? తనకు చెల్లెనో తమ్ముడో ఉండాలంటగా.. వారు ఎక్కడికి పోయారు అని అడిగిన నాలుగేళ్ల కూతురికి ఓ తల్లి ఒంటి నిండా వాతలు పెట్టింది. అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా అంటూ కోపంతో అమానుషంగా ప్రవర్తించింది. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు, నీకు ఎందుకు ఇవన్నీ ? నిన్ను అసలు ఎవరు అడగమన్నారని కొడుతూ అట్లకాడతో విచక్షణా రహితంగా వాతలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన దారుణ సంఘటకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కందికుంట పరిధిలోని నారాయణమ్మ కాలనీకి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. అప్పటికే ఆమెకు మూడేళ్ల కూతురు, 6నెలల గర్భంతో ఉంది. కొంతకాలానికి మరో వ్యక్తిని వివాహమాడిన ఆ మహిళ అతనితో కలిసి ఉంటోంది. కూతురు కూడా తల్లితోనే ఉంటోంది. ఇదే క్రమంలో బాలిక తన తల్లిని.. అమ్మా మా నాన్నెవరు.. తనకు చెల్లెలో, తమ్ముడో ఉండాలంట కదా అని అడగడంతో సమాధానం చెప్పలేక పోయిన ఆ మహిళ.. కూతురును తీవ్రంగా కొట్టి… ఒంటి నిండా వాతలు పెట్టి దాష్టీకానికి పాల్పడింది.

ఒంటిపై గాయాలతో అల్లాడిపోతున్న బాలిక కేకలు విని.. శనివారం సాయంత్రం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలికను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రెండో కాన్పులో పుట్టిన శిశువు గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. బాలికకు తల్లి వాతలు పెట్టడంతో కలకలం రేగింది. దీంతో మహిళపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement