వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ర్యాలీ చేసిన సూచీలు వారాంతం బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కొనసాగడం, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు ఎదురయ్యాయి. పెట్టుబడిదారులు అమెరికాలో పెరుగుతున్న మాంద్యం గురించి ఆందోళన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 609.28 పాయింట్లు పతనమై 73,730 వద్ద, నిఫ్టీ 150.40 పాయింట్లు నష్టపోయి 22,419 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలు నిలదొక్కుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, విప్రో, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.36 వద్ద ఉంది.

Advertisement

Next Story