- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొమ్మిదొందల ఏళ్ల నాటి అద్దాల మసీదు
ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లి, అక్కడి అందమైన కట్టడాలను సందర్శించాలనుకునే ప్రయాణ ప్రియులు ఇది చదివాక ఇప్పటికిప్పుడే ఇరాన్‌కి టికెట్ బుక్ చేసేసుకుంటారు. అక్కడి షిరాజ్ ప్రాంతంలో ఉన్న షా చెరాగ్ మసీదు గురించి తెలిస్తే ఎవరికైనా వెంటనే వెళ్లి చూసేయాలనిపిస్తుంది. బయటికి మామూలు మసీదులాగే కనిపించినా లోపలికి వెళ్లి చూస్తే అద్దాల కాంతులతో మిరుమిట్లుగొలిపే అందాలను తనివితీరా చూడగలగడం జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగే అనుభూతి.
మసీదు చరిత్ర
ఈ మసీదులో అహ్మద్ బిన్ మూసా, మహ్మద్ బిన్ మూసా సమాధులు ఉన్నాయి. 900 ఏళ్ల నాటి ఒక శాసనం ప్రకారం అయతుల్లా అనే ఒక మతప్రవక్త షిరాజ్ మీదుగా వెళ్తుంటే భూమి లోపలి నుంచి ఆకుపచ్చ కాంతి రావడం చూశాడట. అది సమాధి నుంచి వస్తుందని అర్థమై దాని చుట్టూ మసీదు కట్టించాడట. తర్వాత అక్కడ మతసంబంధ పాఠశాలలు వెలిశాయి.
ఇక 14వ శతాబ్ధం నాటికి ఇంజుయిద్ వంశానికి చెందిన షా అబు ఇషాక్ ఇంజు తల్లి రాణి తాష్ ఖాతున్ ప్రస్తుత మసీదు నిర్మాణ పనికి శ్రీకారం చుట్టింది. షా చెరాగ్ అంటే పర్షియన్ భాషలో కాంతికి రారాజు అని అర్థం. అందుకే ఆయన పేరు ప్రతిబింబించేలా మసీదులో కాంతులు రావాలని ఆమె అనుకుంది. అందుకే లోపల మొత్తం అద్దాల ముక్కలు, గాజు గోడలతో నిర్మించింది.
లోపల మొత్తం అద్దాల కాంతులే!
మసీదు లోపలికి అడుగు పెట్టడానికి పూర్తి అద్దాలతో చేసిన పెద్ద డోమ్, పిల్లర్లకు ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగుల అద్దాల ముక్కలతో చేసిన పూత కళ్లు మిరుమిట్లు గొలిపేలా చేస్తాయి. షాండ్లియర్ల నుంచి వచ్చిన వెలుతురిని ప్రతి అద్దం ముక్క పరావర్తనం చేసి మిలమిలా మెరుస్తున్న చుక్కల మధ్య నిలబడిన అనుభూతిని కలిగిస్తాయి. ఏదో పగిలి పోయిన అద్దాల ముక్కల వెలుతురులో నిల్చుని చూస్తున్న భ్రమను కలిగిస్తాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల షా చెరాగ్ మసీదు కొద్దిగా నాశనం అయినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తుండటంతో అక్కడ ఎక్కువ మంది సందర్శించే ప్రదేశంగా ఇప్పటికీ పరిఢవిల్లుతోంది.