మంగోలియన్లకు కరోనా రాదా?

by Shyam |
మంగోలియన్లకు కరోనా రాదా?
X

మంగోలియాలో శనివారం నాటికి 204 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ బయటి నుంచి వచ్చిన వారివే కాగా.. స్థానిక మంగోలియన్లలో ఇంతవరకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. వారు స్వచ్ఛమైన గాలి పీల్చడంతో పాటు సహజంగా దొరికే మాంసం, పాలను ఆహారంగా తీసుకుంటారని, అందుకే వారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువని అంటున్నారు. అంతేకాకుండా తరాలుగా కష్టపడి పనిచేస్తుండటం, గుర్రాలు, మేకలు కాస్తుండటం, 60 నుంచి 45 డిగ్రీల మధ్య మారే ఉష్ణోగ్రతలను తట్టుకుని జీవిస్తుండటం.. వారికి ఈ వైరస్‌ను తట్టుకునే నిరోధకతను పెంచిందని మంగోలియన్లు గట్టిగా నమ్ముతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెంఘిజ్ ఖాన్ వైభవం, విలువలు, రక్తం, క్రమశిక్షణ వారిని అన్ని సమస్యల నుంచి కాపాడుతోందని విశ్వసిస్తున్నారు.

మంగోలియన్లు కరోనా వైరస్‌కు నిరోధకంగా ఉండటానికి గల కొన్ని కారణాలను ఎంక్-ఒయిన్ బ్యాంబడోర్జ్ అనే చరిత్రకారిణి చక్కగా వివరించారు. విదేశీయుల్లా వారు వినియోగదారుల వ్యవస్థ కారణంగా ఒత్తిడికి, కుంగుబాటుకు లోనుకావడం లేదని ఆమె అన్నారు. అంతేకాకుండా వారి మంగోలియన్ సామ్రాజ్య సంచార జీవన విధానాల వల్ల వారికి తరాలుగా వ్యాధినిరోధకత సంక్రమించిందని తెలిపారు. పాశ్చాత్య దేశీయులు సమస్యను సమస్యగా చూసి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని, కానీ మంగోలియన్లు సమస్యతో పాటుగా జీవించడం నేర్చుకుని దాని నుంచి నిరోధకాన్ని పొందుతారని ఎంక్-ఒయిన్ వివరించారు. మాంసం దొరికినపుడు మంగోలియన్లు తింటారని, దొరకనిరోజుల్లో పస్తులు పడుకుంటారని, చావు, పుట్టుకల గురించి పెద్దగా పట్టింపు లేకుండా బతుకుతారని అన్నారు. ఇప్పటికీ డాక్టర్ సాయం లేకుండా తమ మంగోలియన్ జాతి ఆడవాళ్లు బిడ్డకు ఒంటరిగా జన్మనిస్తున్నారంటే తమ మానసిక, శారీరక బలాన్ని ఇతర దేశస్థులు అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు.

మంగోలియన్లు తమ సమస్యలను పాములతో పోల్చుతారు. ఈ కరోనా కూడా ఒక పాము లాంటిదే. తాము సహజంగా ప్రకృతితో సహజీవనం చేస్తూ జీవిస్తాం కాబట్టి తమను పాములు ఏమీ చేయలేకపోతాయని వారు గట్టిగా నమ్ముతారు. అంతేకాకుండా చెంఘిజ్ ఖాన్ కాలంలో మంగోలియన్లు వివిధ ప్రాంతాల మీద దండయాత్రలు చేసి ఆయా ప్రాంతాల వైరస్‌లకు నిరోధకాన్ని పెంచుకున్నారని చరిత్రకారులు అంటున్నారు. కానీ మంగోలియన్లు స్వతహాగా క్రమశిక్షణ గల వారు కాబట్టి లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం వల్ల వారికి వైరస్ సోకలేదని సాంకేతికవాదులు అంటున్నారు. ఏదేమైనా మంగోలియన్లు పెద్దగా కరోనా బారిన పడకపోవడం ఒకింత మంచి విషయమేనని, నిజంగా వారిలో నిరోధక శక్తి ఉంటే దాన్ని కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించే అవకాశం కలుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story