దళితబంధు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

by Anukaran |
దళితబంధు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘దళితబంధు‘ పథకం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ నెల 16న ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించింది. ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం సమావేశమైన కేబినెట్ విస్తృతంగా చర్చించింది. సీఎం కేసీఆర్ ఈ పథకం గురించి మంత్రులకు, అధికారులకు వివరించారు. యాభై వేల రూపాయల వరకు వ్యవసాయ రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీని ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సుమారు ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీ పొందనున్నారు. ఈ నెల చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తికావాలని డెడ్‌లైన్ విధించింది. గడచిన రెండేళ్ళలో పాతికవేల లోపు రుణం ఉన్నవారికి మాఫీ అమలైంది.

ప్రస్తుతం అమలవుతున్న ఆసరా పింఛను పథకానికి లబ్ధిదారుల కనీస వయసును ఇకపైన 57 ఏళ్ళకు కుదించాలని, దీని అమలు కోసం వెంటనే ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో అదనంగా 6.62 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులు కానున్నారు. మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. యధావిధిగా కుటుంబంలో ఒక్కరికే ఫించను వర్తిస్తుంది. ఒకవేళ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ బదిలీ కానున్నది. దోభీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటు నిర్ణయాన్ని వారంలోగా రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కరోనా తాజా పరిస్థితులను చర్చించిన కేబినెట్ కొత్తగా పెట్టబోయే ఏడు మెడికల్ కాలేజీలు, ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పురోగతి గురించి ఆరాతీసింది. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న ’టిమ్స్’ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రి తరహాలోనే కొత్తగా సనత్ నగర్ (చెస్ట్ ఆస్పత్రి ఆవరణ), ఎల్‌బీ నగర్, అల్వాల్ ప్రాంతాల్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉనికిలోకి వస్తాయని పేర్కన్నది. కొత్తగా ఏడు వైద్య కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయని, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధిపై చర్చించి తదుపరి మంత్రివర్గ సమావేశానికి నివేదిక సిద్ధం చేయలాని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.

ఉద్యోగాల్లో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్

ఆర్థికంగా బలహీన వర్గాల యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించనున్నట్లు స్పష్టం చేసిన మంత్రివర్గం గరిష్ట వయో పరిమితిని ఐదేళ్ళు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. వార్షికాదాయం రూ. 8 లక్షలు ఉన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మేరకు తెలంగాణలోనూ దీన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటున్నందున ఈ కొత్త నిబంధన కూడా అమలుకానున్నది. ఇప్పటికే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు మంజూరయ్యాయో, ఎన్ని ఖాళీగా ఉన్నాయో జిల్లాలవారీగా, జోన్లవారీగా ఆర్థిక శాఖ అధికారులు లెక్కతీసి కేబినెట్ సమావేశంలో సమర్పించారు.

అనాథల సంరక్షణకు సబ్ కమిటీ

కరోనా కారణంగా అనాథలైన పిల్లలను కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం రాష్ట్రంలోని అనాథ శరణాలయాల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించింది. అనాథలైన పిల్లల పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. తల్లిదండ్రులను కోల్పోయి ఎదిగే వయస్సులో ఉన్న పిల్లలు ఒంటరిగా మారి మానసిక వేదనకు, సామాజిక వివక్షకు గురవుతారని, సొంత కాళ్ల మీద నిలబడి ప్రయోజకులయ్యేంత వరకు ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని పేర్కొన్నది. అనాథ పిల్లలకోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని, అధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అనువుగా ఉంటే గుర్తించి అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు.

నిర్దిష్ట కార్యాచరణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేటీఆర్ సభ్యులుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఆహ్వానితులుగా సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అనాథల పరిస్థితుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

ప్రతీ జిల్లాలో దళిత్ సెంటర్

దళిత బంధు పథకం సమర్ధవంతంగా అమలుకావడం కోసం ప్రతీ జిల్లాలో ఒక ‘సెంటర్ ఫర్ దళిత ఎంటర్‌ప్రైజ్‘ను ఏర్పాటు చేయాలని, పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రోత్సాహం అందించాలని మంత్రివర్గం నొక్కిచెప్పింది. వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం అందించాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన కేబినెట్ ఈ పథకం అమలు కోసం పటిష్టమైన యంత్రాంగం అవసరమని పేర్కొన్నది. లబ్ధిదారులకు ప్రత్యేక కార్డు నమూనాను పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసి వారి పురోగతిని పర్యవేక్షించాలని పేర్కొన్నది. లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఇస్తున్నందున ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వారికే కల్పించాలని ఈ సమావేశంలో సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, దళితబంధు స్వచ్ఛంద కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తారని, తగిన అవగాహన కల్పిస్తారని పేర్కన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న ఉపాధికి అనుగుణంగా ప్రభుత్వ సిబ్బంది శిక్షణ, అవగాహన కల్పించడంతో పాటు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

గిరిజనులకన్నా దళితుల పరిస్థితి దయనీయం

రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్ర జనాభాలో ఇరవై శాతం ఉన్నప్పటికీ వారి చేతుల్లో ఉన్న సాగుభూమి మాత్రం 13 లక్షల ఎకరాలేనని సీఎం వ్యాఖ్యానించారు. దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదన్నారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దళితులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న దళితబంధు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పాటు చట్టభద్రత (చట్టబద్ధత) కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్‌సీ ప్రగతినిధి చట్టం తరహాలోనే బడ్జెట్‌లో కేటాయించిన నిధులలో మిగిలిపోతే తరువాతి సంవత్సరానికి బదలాయించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. దళితబంధు దేశానికే దారి చూపే పథకం అవుతుందని క్యాబినెట్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed