మీది ప్రజా విజయం.. మాది ట్యాంపరింగా..?

by Shamantha N |
మీది ప్రజా విజయం.. మాది ట్యాంపరింగా..?
X

న్యూఢిల్లీ: ఎన్నికలలో బీజేపీ గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని విమర్శించే ప్రతిపక్ష పార్టీలు.. వాళ్లు గెలిస్తే మాత్రం ప్రజా విజయంగా చెప్పుకుంటున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కాదా..? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ 41 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. తాము ఏ కొత్త చట్టం తీసుకొచ్చినా అది ప్రజలకు విఘాతం కలిగించే విధంగా ఉందంటూ పలువురు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘రైతుల చట్టాలు తీసుకొస్తే వారి భూములు లాక్కుంటాం అని.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తీసుకొస్తే తద్వారా ప్రజల పౌరసత్వాన్ని బలవంతంగా తీసుకుంటారని.. రాజ్యాంగాన్ని మార్చనున్నారని.. రిజర్వేషన్లను ఎత్తివేయనున్నారని, కార్మిక చట్టాలను తీసుకొస్తే కార్మిక హక్కులు కాలరాస్తున్నారని తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. పలువురు వ్యక్తులు, సంస్థలు పనిగట్టకుని వీటి మీద విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఇది కఠినమైన సవాల్ వంటిదని, కార్యకర్తలంతా ప్రజల దగ్గరకు వెళ్లి వాస్తవాలను వారికి వివరించే ప్రయత్నం చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed