సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

by vinod kumar |
సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి కళ్లెం వేసే మార్గాలపై ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. రానున్న వారాల్లో కరోనా పరీక్ష నిర్వహించడం, గుర్తించడం, ఐసోలేషన్, క్వారంటైన్ ల పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్ సంసిద్ధం చేయాలని అన్నారు.

వీటితోపాటు లాక్ డౌన్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధాని మోడీ… సీఎంలతో చర్చించినట్లు తెలిసింది. 21 రోజుల లాక్ డౌన్ ఈనెల 14న ముగిసిన తర్వాత ప్రజలు యధావిధిగా ఇష్టం వచ్చినట్టు తిరిగితే కరోనాను కట్టడి చేయడం కష్టతరమవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. కాబట్టి లాక్‌డౌన్‌ అనంతరం ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించేలా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త వ్యూహాన్ని అమలు చేయాలని తెలిపినట్లు ఒక ప్రకటన పేర్కొంది. లాక్ డౌన్ తర్వాత కూడా రాష్ట్రాలు పలు చర్యలు తీసుకోవాలని మోడీ అభిప్రాయపడ్డారు. 14వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ అమలుచేసి సామాజిక దూరాన్ని పాటించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించినట్లు ఆ స్టేట్మెంట్ వివరించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఏడుగురు సీఎంలు మోడీతో ఇంటరాక్ట్ అయ్యారు. కాగా, కరోనాపై పోరాడేందుకు మరిన్ని నిధులు కావాలన్న ముఖ్యమంత్రుల విజ్ఞప్తిపై కేంద్రం స్పందించలేదని తెలుస్తోంది.

Tags : Coronavirus, lockdown, pm modi, video conference

Advertisement

Next Story