థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. వర్క్ విషయంలో MNC కంపెనీల కీలక నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-08-24 22:53:17.0  )
థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. వర్క్ విషయంలో MNC కంపెనీల కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ సృష్టించిన కల్లోలానికి అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. ఇందులో సాఫ్ట్ వేర్ రంగం కూడా ఒకటి. కరోనా కారణంగా ఎందరో టెకీలు ఉద్యోగాలు కోల్పోయినా మిగిలిన వారికి వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించి సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. కొవిడ్ మొదటి వేవ్ అనంతరం వైరస్ కాస్త తగ్గుముఖం పడితే తిరిగి కార్యాలయాలను తెరవాలని భావించినా.. కొద్దిరోజులకే సెకండ్ వేవ్‌తో వైరస్ ప్రజానీకాన్ని అతలాకుతలం చేసింది.

దీని ఎఫెక్ట్ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే, ఇటీవల సాఫ్ట్‌వేర్ సంస్థల యాజమాన్యాలతో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సంస్థలు వర్క్ ఫ్రం హోంను రద్దు చేయాలని సూచించారు. ఐటీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తామని భరోసానిచ్చారు. అయినా వర్క్ ఫ్రం హోంకే ఎంఎన్‌సీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.

ఈ ఏడాది చివరి వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో 70 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. ఇతర చిన్న స్థాయి సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఉండే సిబ్బంది మొత్తం కలుపుకొని 30 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు వెళ్తున్నారు.

తెలంగాణ సర్కార్ ఐటీ సంస్థలను తిరిగి ఓపెన్ చేయాలని సూచించినా తమకు ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ముఖ్యమని సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకువచ్చేందుకు సంస్థలు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎంప్లాయి లైఫ్‌ని రిస్క్‌లో ఎందుకు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాయి.

అయితే, ఐటీ శాఖ కార్యదర్శి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను రద్దు చేస్తే అందుకు తగినట్లుగా విధివిధానాలు ఖరారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయినా అందుకు ఐటీ సంస్థలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వం కూడా తమ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు 100 శాతం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సంస్థలు ససేమిరా అంటున్నాయి.

ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోం విధానాన్నే కొనసాగించాలని భావిస్తున్నాయి. అప్పటి వరకు థర్డ్ వేవ్ అటాక్ చేస్తే మరింత కాలం పొడిగించే అవకాశాలున్నాయి. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకురావాలన్న అంశంపై నేటికీ ఉద్యోగులకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే మరింత కాలం ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వడం వల్ల ఆ సంస్థలు, ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతున్నప్పటికీ వారిపై ప‌రోక్షంగా ఆధార‌ప‌డి వ్యాపారాలు చేసుకునే వారికి మాత్రం న‌ష్టాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్, రియ‌ల్ ఎస్టేట్, ఆతిథ్య రంగాలపై ఈ ఎఫెక్ట్ భారీగా పడింది. ఐటీశాఖపై ఇత‌ర రంగాలు ఆధార‌ప‌డి ఉన్న నేపథ్యంలో ఆ సంస్థల ఉద్యోగుల‌ను కార్యాల‌యాలకు పిలిపించుకొని విధులు నిర్వర్తించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

2020 మార్చి 22 నుంచి కేంద్ర లాక్ డౌన్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం బాటపట్టాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనంతరం ఔట్ పుట్ అద్భుతంగా రావడంతో ఎంఎన్‌సీ సంస్థలు అదే విధానాన్ని నేటి వరకు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నా, ఆఫీస్ నుంచి పని చేస్తున్నా ఔట్ పుట్‌లో తేడా రాకపోవడానికి తోడు ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో సంస్థలు వినియోగించుకుంటున్నాయి.

ఉద్యోగులు గతంలో కార్యాలయానికి వస్తే 8 గంటల షిష్ట్ మాత్రమే పనిచేసేవారు. కాగా వర్క్ ఫ్రం హోం కారణంగా 10 గంటల వరకు కూడా చేస్తున్నారు. దీనివల్ల సంస్థలకు మేలు జరుగుతోంది. కొవిడ్ వచ్చినా ఐటీ సంస్థలు లాభాల బాటలోనే నడుస్తున్నాయనడానికి ఇదే కారణంగా ఉద్యోగులు చెబుతున్నారు. వారిపై పనిభారం పెరిగినా గతంలో ఆఫీస్‌కు వెళ్లాలంటే ట్రాఫిక్ జామ్, పెట్రోల్ ఇతర కారణాలతో పోల్చుకుంటే వర్క్ ఫ్రం హోం బెటర్ అని ఉద్యోగులు చెబుతున్నారు.

చిన్న తరహా సంస్థలు, 50 మంది ఉద్యోగులకు లోబడి ఉన్న సంస్థలు మాత్రమే ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి. పెద్ద సంస్థలతో పోల్చుకుంటే వారికి ఉద్యోగులతో కమ్యూనికేట్ అవ్వడానికి కావాల్సినంత ప్రొటోకాల్ లేకపోవడంతో ఉద్యోగులను తిరిగి తెచ్చుకున్నాయి. కానీ, ఇందుకు ఎంఎన్‌సీ సంస్థలు ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. బడా కంపెనీల్లో ఉద్యోగులకు క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రం హోం వల్ల ఇది సంస్థకు లాభాలు తెచ్చే అంశం.

దీనికితోడు నెట్, మెయింటెనెన్స్, కొన్ని కంపెనీలు స్నాక్స్ సైతం అందిస్తాయి. ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం వల్ల ఈ ఖర్చులన్నీ సంస్థలకు కలిసొచ్చే అంశంగా మారింది. అందుకే వర్క్ ఫ్రం హోంకే మొగ్గు చూపడానికి కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉండగా వర్క్ ఫ్రం హోం వల్ల క్యాబ్ డ్రైవర్లు, ఆఫీస్ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించే గార్డులు సైతం ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

సంస్థలు లాభాల్లో ఉన్నాయి..

ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించినా లాభాల్లోనే ఉన్నాయి. ఉద్యోగులకు పని వేళలు పెరిగాయి. ఔట్ పుట్ కూడా బాగానే రావడం వల్ల సంస్థలు వర్క్ ఫ్రం హోంకే ప్రియారిటీ ఇస్తున్నాయి. ఉద్యోగులపై పని వేళల కారణంగా ఒత్తిడి పెరిగినా ఇంటి వద్ద నుంచి చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సంస్థలు లాభాల్లోనే ఉన్నా ఎంఎన్‌సీ కంపెనీలు హైక్ ఇవ్వకపోవడం దారుణం. కొవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ఉద్యోగాలు కోల్పోయినా రిక్వైర్‌మెంట్ మేరకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నారు.
= రాజుకుమార్, ఐటీ ఉద్యోగి, హైదరాబాద్

డిసెంబర్ వరకు ఇంటి నుంచే విధులు

ఎంఎన్‌సీ కంపెనీలన్నీ ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాయి. థర్డ్ వేవ్ అక్టోబర్‌లో అటాక్ చేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే తీవ్రతను బట్టి మరింత కాలం వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించే యోచనలో సంస్థలు ఉన్నాయి. పలు చిన్న కంపెనీల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేస్తారా.? ఆఫీస్‌కు వచ్చి విధులు చేపడుతారా మీ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఉద్యోగులకు కొంత ఉపశమనం లభించింది.
= సందీప్, ఐటీ ఉద్యోగి, హైదరాబాద్.

Advertisement

Next Story

Most Viewed