కవితకు మరోసారి ఎమ్మెల్సీ దక్కేనా..?

by Shyam |   ( Updated:2021-11-03 21:08:53.0  )
కవితకు మరోసారి ఎమ్మెల్సీ దక్కేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో స్థానిక సంస్థల కోటా కింద భర్తీ చేయాల్సిన 12 స్థానాలకు షెడ్యూలు ప్రకటించనున్నది. వచ్చే ఏడాది జనవరి 5 తేదీ నాటికి రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం పూర్తికానున్నది. వీటికి డిసెంబరులోనే ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలు ఎంత మంది మంది ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓటర్లు ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకునే అర్హత ఉంది తదితర వివరాలన్నింటినీ రెండు రోజుల్లోగా పంపాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ లేఖ రాశారు.

దీపావళి పండుగ తర్వాత కలెక్టర్ల నుంచి నివేదిక అందనున్నట్లు సీఈఓ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఈసీకి సీఈఓ లేఖ రాస్తారని, ఆ ప్రకారం షెడ్యూలుపై నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నాయి. ఈ వారం చివరికల్లా కలెక్టర్ల నుంచి నివేదిక వస్తుందని భావిస్తున్నామని, వచ్చే వారం ఈసీకి పంపిస్తామని, ఈ నెల చివరికల్లా షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపాయి. ఈ నెల చివర్లో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రక్రియ పూర్తికాకముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 స్థానాలను భర్తీ చేయడానికి షెడ్యూలు విడుదల కావచ్చని పేర్కొన్నాయి.

ఎమ్మెల్యే కోటాలో జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి టీఆర్ఎస్ అధినేత కసరత్తు ఇంకా మొదలుపెట్టలేదు. ఆశావహులు ఒక్కో స్థానానికి పది మంది చొప్పున ఉన్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం అభ్యర్థులను ఎంపిక చేయడం సవాళ్ళతో కూడుకున్నది. అందరినీ ఏకకాలంలో బుజ్జగించడంలో ఇబ్బందులున్నాయి. అసంతృప్తి, అసమ్మతిని చల్లార్చడం గతంలో ఉన్నంత సులువుగా లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది కొలిక్కి రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం మరి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది.

వచ్చే ఏడాది జనవరి 5 నాటికి రాష్ట్రంలో పదవీకాలం ముగిసిపోతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు వీరే :
పురాణం సతీష్ (ఆదిలాబాద్)
భానుప్రసాద్ (కరీంనగర్)
నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్)
భూపాల్‌రెడ్డి (మెదక్)
శంభీపూర్ రాజు (రంగారెడ్డి)
కసిరెడ్డి నారాయణ రెడ్డి (మహబూబ్‌నగర్)
కూచికుళ్ళ దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)
బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం)
తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ)
పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి)
కల్వకుంట్ల కవిత (నిజామాబాద్)
పోచంపల్లి శ్రీనివాసరెడ్డి (వరంగల్)

టీఆర్‌ఎస్‌లో ఆశావాహులకు నిరాశే

Advertisement

Next Story

Most Viewed