దళితులపై నిజంగా ప్రేముంటే ఆ పనిచేయండి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

by Shyam |
MLC Narsi Reddy
X

దిశ, నార్కట్‌పల్లి: యువజన వ్యతిరేక విధానాలను అవలంభించే పాలక ప్రభుత్వాలకు చరమగీతం పాడాలని, అందుకు డీవైఎఫ్ఐ యువకులను, విద్యార్థులను చైతన్యం చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగిన డీవైఎఫ్ఐ రాష్ట్ర రెండో మహాసభలు జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువతరం, విద్యార్థులు నడుం బిగించి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసే విధానం అవలంభిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను ఎన్నికల కోసం మాత్రమే ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల నుండి త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం ఉద్యోగాలపై ఉసేత్తడం లేదన్నారు.

అలాగే రైతుబంధు అమలు కింద వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. వందల ఎకరాలు ఉండి కౌలుకిచ్చి పెద్ద పెద్ద నగరాలలో నివాసముంటున్న వారికి రైతుబంధు మరో ఆదాయ వనరుగా మారిందన్నారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా దళితులపై ప్రభుత్వానికి ప్రేమ ఉన్నట్లయితే లక్ష కోట్ల నిధులతో రాష్ట్రంలోని దళితులందరికీ ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దళితులను పావుగా వాడుకొని మోసపూరితమైన వాగ్దానాలతో వారి ఓటు బ్యాంకును వాడుకునేందుకు ఉచిత హామీలు ఇస్తున్నారని దళితులు నిరుద్యోగులు ఈసారి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి అజయ్, రాష్ట్ర నాయకులు విప్లవ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, మండల అధ్యక్ష,కార్యదర్శులు పంది నరేష్, జిట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story