ఇంట్రెస్టింగ్‌గా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వారితో టీఆర్ఎస్‌‌లో టెన్షన్..? 

by Anukaran |   ( Updated:2021-11-25 00:21:21.0  )
TRS vijaya garjana sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అధిష్టానం మెప్పుపొందేందుకు ఏకగ్రీవమే టార్గెట్‌గా ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్లు వేయడంతో.. ఉపసంహరించుకునేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఏకగ్రీవానికి సహకరిస్తే ఆర్థిక భరోసా ఇస్తామనే హామీలు ఇస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొందరు ఉపసంహరణకు మొగ్గు చూపుతున్నారు. కరీంనగర్‌లో మాత్రం అధికార పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యం అయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఇండిపెండెంట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటివరకు అధికారపార్టీకి పోటీ లేకపోవడంతో మూడు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం అయింది.

బరిలో స్వతంత్రులు..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీల తరఫున కాకుండా ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు. ఒక నామినేషన్‌కు పది మంది సభ్యులు బలపర్చారు. వీరిలో అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడంతో అధికారపార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో కొంత మందికి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకపోవడం, అభివృద్ధికి నిధులు ఇస్తామని రిక్తహస్తం చూపడంతో అధికారపార్టీపై కోపంతో బరిలోకి దిగినవారే అధికులు ఉన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకుంటే భారీగా డబ్బు ముట్టచెబుతామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.

అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. మండలాల వారీగా ఎంత మంది ఎంపీటీసీలు ఉన్నారు.. వారు ఏ పార్టీకి చెందినవారనే వివరాలను అధికార పార్టీ ఇప్పటికే సేకరించింది. టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ఇప్పటికే పలుస్థాయిల్లో రాయబారాలు నడుపుతున్నారు. విననివారితో నేరుగా ఎమ్మెల్యే, ఎంపీలు ఫోన్‌లో మాట్లాడటంతోపాటు రూ. ఐదు లక్షల వరకు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. ఇదే కాకుండా భవిష్యత్‌లోను ఆర్థికంగా భరోసా ఇస్తామని పేర్కొంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారం వరకు ఉండటంతో మెజార్టీ రెబల్​అభ్యర్థులు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది.

ముగ్గురు ఏకగ్రీవం..

నిజామాబాద్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీరిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత, స్వతంత్ర అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ ఉన్నారు. నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పోటీలో ఎవరు లేకపోవడంతో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను సుంకరి రాజు (శంభీపూర్ రాజు), పట్నం మహేందర్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. అయితే చంద్రశేఖర్ నామినేషన్ పత్రంలో ధరావత్తు, అభ్యర్థిని బలపర్చిన వారి సంతకం లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో అధికారపార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం ప్రకటించనున్నారు.

తోక ముడిచిన కేసీఆర్.. సీఎంకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ దొరకలేదా.?

Advertisement

Next Story

Most Viewed