కరోనా తర్వాత.. కదులుతున్నారు

by Shyam |   ( Updated:2021-06-10 21:44:32.0  )
mla
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోన ప్రభావం రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరిగి వారి వారి నియోజకవర్గాలలో పర్యటనలను వేగవంతం చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత నెల రోజుల నుండి కరోనా విజృంభిస్తుడడంతో కొంత మంది ఎమ్మెల్యేలు తమ తమ కార్యక్రమాలు పర్యటనను వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమయ్యారు. కేవలం నలుగురైదుగురు మాత్రమే కరోనాను లెక్కచేయకుండా తమ తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అండగా నిలిచారు. ఒకరకంగా పలు నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.. జిల్లా పరిషత్ సమావేశాలు వాయిదా పడ్డాయి. మున్సిపాలిటీలు, మండల పరిషత్, గ్రామ పంచాయతీ సమావేశాలు తూతూ మంత్రంగా సాగాయి. ఈ కారణంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ గెలుచుకోవడంతో పాటు, సమస్యలు పెరిగిపోయాయి.

mla

వేగం తగ్గని పర్యటనలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు కొందరు తమ తమ నియోజకవర్గాలలో కరోనా సమయం, సాధారణ సమయం అన్న తేడాలు లేకుండా తమ పర్యటనలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కొత్త ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి కరోనా సమయాలలో పూర్తిగా ప్రజల వెన్నంటే ఉన్నారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం లోనూ, భోజన వసతులు ఏర్పాటు చేయడంలోనూ తమ వంతు పాత్రను నిర్వహించారు. వైద్య సదుపాయాలను కల్పించే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులు చేయి దాటకుండా తమ వంతు కృషి చేశారు. కరోనా తగ్గిన తర్వాత కూడా వారు అదేస్థాయిలో తమ తమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యదా విధిగా కొనసాగేలా చర్యతు తీసుకుంటున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం తమ నియోజకవర్గంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.

ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారు

ఈ నెల రోజులలో పలువురు ఎమ్మెల్యేలు ఒకట్రెండు సార్లు మినహా మిగతా రోజులన్నీ తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కరోనా సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో పూర్తిగా నియోజకవర్గ కేంద్రానికి పరిమితమయ్యారు. ఎన్నికల అనంతరం పలువురు కరోనా బారిన పడడంతో ఎమ్మెల్యే సైతం బయట తిరగడానికి సాహసం చేయలేకపోయారు. నాగకర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమ తమ నియోజకవర్గాలలో రెండు మూడు కార్యక్రమాలకు మినహా మిగతా కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు కరోనా సమయంలో పెద్దగా తిరిగిన దాఖలాలు లేవు. ఎంపీ మన్యం శ్రీనివాస్ రెడ్డి సైతం అడపదడప కార్యక్రమాలకు హాజరయ్యారు తప్ప. పెద్దగా పర్యటనలలో పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు.

ఇప్పటికైనా పర్యటనలు పెరుగుతాయా..?

పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన లీడర్లు కరోనాకు భయపడి ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా దాదాపుగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పర్యటనలు పెరిగి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.. ప్రత్యేకించి వర్షాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడడంతో పాటు ప్రాజెక్టులు, నీటి సరఫరా విషయాలలో ప్రత్యేక దృష్టి సారిస్తారు అన్న ఆశాభావాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed