రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీల ధర్నా : శ్రీధర్ బాబు

by Sridhar Babu |
రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీల ధర్నా : శ్రీధర్ బాబు
X

దిశ, భూపాలపల్లి : రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలు.. ధాన్యం కొనగోలు చేయకుండా ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు చేయవలసిన పని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేయడం ఏంటని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ఈ రెండు ప్రభుత్వాలు గల్లీలో లొల్లి పెట్టుకుంటూ.. ఢిల్లీలో దోస్తీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పాటుపడటంలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. రైతు పండించిన ప్రతీ గింజా కొనే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విస్లావత్ దేవన్, జిల్లా అధికార ప్రతినిధి అజ్మీరా జంపన్న, కోమల రాజిరెడ్డి, జంగిటి శ్రీనివాస్, బుర్ర కొమురయ్య, పోనకంటి శ్రీనివాస్, ఐలవేణి రమేష్, రమణా చారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story