రోడ్లు, బస్ స్టేషన్‌లకు నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే సీతక్క

by Shyam |
రోడ్లు, బస్ స్టేషన్‌లకు నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు : ములుగు నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే సీతక్క గురువారం అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా ములుగు నూతన జిల్లాలో బస్ డిపో ఏర్పాటు చెయ్యాలని, జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న బస్ స్టేషన్ శిథిలావస్థలో ఉందని తెలిపారు. నూతన బస్ స్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం, శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర, లక్ష్మీ నరసింహ స్వామీ దేవాలయం, బొగత.. వంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ డిపో ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రి దృష్టికి సమస్యను తీసుకు వెళ్ళారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయల సమస్యలు పరిష్కరించాలి..

అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క.. ఎస్సీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తరతరాలుగా ఎస్సీ, ఎస్టీలు సామాజిక అణచివేతకు గురవుతున్నారు. స్వాతంత్రం అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ కల్పిస్తే జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచకపోవడంతో.. ఆ కేటగిరిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయలకు ప్రమోషన్లలో నష్టం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కోటాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళారు.

‘బిల్ట్ పరిశ్రమను’ ప్రారంభించాలి..

అసెంబ్లీలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే సీతక్క కలిశారు. ఈ సందర్బంగా ములుగు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలపై లేఖలో వివరాలను అందించారు. ములుగు నియోజకవర్గంలోని మంగపేట మండలం కమలాపూర్‌లో బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడటంతో ప్రత్యక్షంగా 3వేల మంది, పరోక్షంగా 10వేల మంది రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులను ఆదుకోవాలని, దసరా పండుగకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

రోడ్లకు నిధులు మంజూరు చేయాలి..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే సీతక్క.. ములుగు నియోజకవర్గంలో రోడ్ల మరమత్తులు చేపట్టాలని నూతన రోడ్లకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో సబ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎస్సీ. ఎస్టీ ఉద్యోగ. ఉపాధ్యాయుల ప్రమోషన్లలో వివక్షత తగదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed