అధ్వానంగా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు.. ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్

by Sridhar Babu |   ( Updated:2021-12-17 09:38:26.0  )
అధ్వానంగా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు.. ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్
X

దిశ, భద్రాచలం: నిర్మాణం పూర్తి కాకుండానే అధ్వానంగా తయారైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను చూసి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం రాజీవ్‌నగర్ కాలనీలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ళను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇళ్ళ నిర్మాణంలో లోపాలపై కాలనీ ప్రజలు ఎమ్మెల్యే వీరయ్యకు పలు ఫిర్యాదులు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి అక్కడ ఉన్న సుమారు 25 గుడిసెలను పీకేసి నిర్మాణం ప్రారంభించారని స్థానికులు చెప్పారు.

మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిందని, అసంపూర్తి ఇళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు
అడ్డాగా మారాయని ప్రజలు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట ఇళ్ళల్లో ఉండాలంటే భయమేస్తుందని స్థానిక ప్రజలు వాపోయారు. ఆరు నెలల్లో ఇండ్లు ఇస్తామని చెప్పిన అధికారులు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్లు అడ్రస్ లేరని తెలిపారు. ప్రస్తుతం పీకేసిన గుడిసెల వాసులందరూ మురికి కాలువ పక్కన నివసిస్తున్నామని చెప్పారు. వర్షం వస్తే వరద వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ఆదర్శ కాలనీల ప్రజలు ఎమ్మెల్యే పొదెం వీరయ్య వద్ద మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య వెంటనే అధికారులను పిలిచి బెడ్ రూమ్ ఇళ్ళ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గత నాలుగేళ్ళుగా బెడ్ రూమ్ ఇండ్ల బడ్జెట్ ఇవ్వడంలేదని, మెటీరియల్ ధరలు పెరగడం వలన సగంలోనే ఇండ్లు ఆగిపోయాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదని ఆరోపించారు. పాలన చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి లబ్ధిదారులకు అందించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరేల రవి కుమార్, మాజీ గ్రంధాలయ చైర్మన్ బోగాల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, సీనియర్ నాయకులు దుద్దుకూరు సాయిబాబు, ఎస్టీ సెల్ నాయకులు కురసం చిట్టిబాబు దొర, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు చింతిరాల సుధీర్, ప్రదీప్, శ్రీను, తదితరులు ఉన్నారు.‌

Advertisement

Next Story

Most Viewed