పుట్ట మధు మిస్సింగ్.. అంతా రహస్యం

by Anukaran |
Putta Madhu
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇంట్లో వ్యక్తి ఒక్కరోజు కనిపించకపోతేనే కంగారు పడిపోతాం. అక్కడా, ఇక్కడా వెతికి పోలీస్ స్టేషన్ కు వెళ్తాం. కానీ సహాయ మంత్రి హోదా కలిగిన జడ్పీ చైర్మన్ మిస్సింగై.. ఆరో రోజు గడుస్తున్నా.. దానిపై అటు కుటుంబ సభ్యులుగానీ, ఇటు ఆయన అనుచరగణం గానీ నోరు మెదపడం లేదు. ఆయన అదృశ్యంపై మీడియాలో పతాక శీర్షికలో కథనాలు వస్తున్నా.. మున్సిపల్ చైర్ పర్సన్ అయిన ఆయన భార్య సైతం నోరు మెదపక పోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతా గప్ చుప్..

లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా ఉంది పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మిస్సింగ్ వ్యవహారం. ఆయన అదృశ్యమై ఆరో రోజు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించలేదు. తాజాగా గురువారం మంథనిలో టీఆర్ఎస్ శ్రేణులు మీడియా సమావేశంలో కూడా పుట్ట మధు మిస్సింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం తాము, తమ నాయకుడు మధు.. ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉండమని, కేసీఆర్‌కే విధేయులమని ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇంతకీ ఆయన అదృశ్యం అయ్యాడా లేక కిడ్నాప్ అయ్యాడా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అనారోగ్యంతో కేరళలో ఉన్నాడని, కూతురును చూసేందుకు రాయపూర్ వెల్లాడని ఆఫ్ ది రికార్డ్ లో చెప్తున్నప్పటికీ మీడియా ముందు అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదో అంతు చిక్కకుండా పోయింది.

ఆమె లేదెందుకో..?

పుట్ట మధు భార్య, మంథని మునిసిపల్ చైర్ పర్సన్ శైలజ ఈ మీడియా సమావేశంలో కనిపించకపోవడం మరో చర్చకు దారి తీస్తోంది. పుట్ట మధు తరువాత కేడర్ తో టచ్ లో ఉండే శైలజ కనీసం మీడియా సమావేశంలో అయినా కనిపించాల్సింది కదా అంటున్న వారూ లేకపోలేదు.

ఆ ఇంట్లోనే ఆయన వాహనం…

Putta Madhu Car

పుట్ట మధు తరుచూ తిరిగే వాహనం ఆయన మామ ఇంట్లోనే పార్క్ చేసి ఉంది. మధు వ్యక్తిగత పనులపై వెళ్లినట్టయితే ఆయన తిరిగే వాహనం వదిలేసి మరో వాహనంలో వెళ్లిపోవడానికి కారణం ఏంటీ అన్నది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నాడంటూ చేస్తున్న ప్రచారం కూడా విస్మయానికి గురి చేస్తోంది. అలాంటి ప్రాంతానికి ఆయన వెళ్లాల్సిన అవసరం ఏంటీ అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ కేడర్ లో సమాధానం లేకుండా పోతోంది. కేవలం ఈటల వెంట తాము ఉండమని కేడర్ చెప్తోంది. అయితే పుట్ట మధుపై వార్తలు రాస్తే క్రిమినల్ కేసులు పెడ్తామంటూ మీడియాను ఎందుకు బెదిరిస్తోంది.? మాఫియాను మరిపించే విధంగా డాన్ లుగా భావిస్తున్నారా? అంటు మంథని ప్రజలు గొణుక్కుంటున్నారు. గన్ మెన్ల ఆచూకీ లేదు, జడ్పీ చైర్మన్ అడ్రస్ లేదు అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర దించాల్సిన అవసరం ముందుగా మంథని టీఆర్ఎస్ కేడర్ పైనే ఉంది.

Advertisement

Next Story